Delhi Liquor Scam: అరుణ్ రామచంద్ర పిళ్ళైకి 7 రోజుల ఈడీ కస్టడీ

ABN , First Publish Date - 2023-03-07T15:56:15+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో హైదరాబాద్‌‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైకి 7 రోజుల ఈడీ కస్టడీ..

Delhi Liquor Scam:  అరుణ్ రామచంద్ర పిళ్ళైకి 7 రోజుల ఈడీ కస్టడీ

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో హైదరాబాద్‌‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైకి 7 రోజుల ఈడీ కస్టడీ (Custody)కి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. ఈనెల 13 వరకు రామచంద్ర పిళ్ళై (Arun Ramachandra Pillai)ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పిళ్లైను గత రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మరికొంత సమాచారం కోసం పిళ్లైను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ (CBI) కోర్టును ఈడీ అధికారులు కోరారు. ఇరువాదనలు విన్న న్యాయస్థానం పిళ్ళైని విచారించేందుకు 7 రోజుల ఈడీ కస్టడీ కోర్టు అనుమతిచ్చింది. ఇండో స్పిరిట్‌లో అరుణ్ పిళ్ళై భాగస్వామిగా ఉన్నారని ఈడీ చెబుతోంది. లిక్కర్ పాలసీ కోసం జరిగిన సమావేశాల్లో పిళ్ళై పాల్గొన్నారని, సమీర్‌ మహేంద్రుతో కలిసి స్కామ్‌లో పిళ్ళై కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. పిళ్ళై, ఆడిటర్ బుచ్చిబాబుకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ ఉన్నాయిని, సౌత్‌గ్రూప్ (Southgroup) చెల్లించిన కిక్‌బ్యాక్ నగదు పంపిణీలో పిళ్ళై ప్రధాన పాత్రగా ఈడీ అధికారులు పేర్కొన్నారు. అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు (Buchi Babu)ను కలిపి విచారించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఈడీ కోరింది.

ఇటీవల మద్యం కుంభకోణంలో అవకతవకలపై రెండు రోజులపాటు రామచంద్ర పిళ్ళైని ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అరుణ్ పిళ్ళై‌కి చెందిన వట్టినాగులాపల్లిలో రూ .2.2 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రామచంద్ర పిళ్లైతో కలిపి ఇప్పటి వరకూ 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైను ఢిల్లీ మద్యంకుంభకోణంలో నిందితుడిగా పేర్కొంది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన మీదట దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లలో అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు కూడా ఉంది. ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్టైన వారిలో ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన వారే ఉండటం గమనార్హం. అరుణ్ పిళ్ళై.. ఈ స్కామ్‌లో అభిషేక్ బోయిన్‌పల్లి, సమీర్ మహేంద్రూ, విజయ్ నాయర్ తదితరులకు రామచంద్ర పిళ్లై సహకరించారని ఈడీ భావిస్తోంది. కాగా.. ఈ వరుస అరెస్ట్‌ల నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పేరు తెరపైకి వచ్చింది. తదుపరి అరెస్ట్ ఆమెనంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అరెస్టైన విషయం తెలిసిందే. ఇక ముందు కూడా మరిన్ని అరెస్ట్‌లు ఉండే అవకాశముందని తెలుస్తోంది.

Updated Date - 2023-03-07T15:56:15+05:30 IST