Secunderabad Fire Accdent: డెక్కన్ బిల్డింగ్‌పై నిపుణుల బృందం రిపోర్ట్
ABN , First Publish Date - 2023-01-20T16:24:34+05:30 IST
డెక్కన్ బిల్డింగ్ (Deccan Building)పై నిపుణుల బృందం రిపోర్ట్ సమర్పించింది. ఇలాంటి గోదాములు గ్రేటర్ పరిధిలో 25 వేలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్: డెక్కన్ బిల్డింగ్ (Deccan Building)పై నిపుణుల బృందం రిపోర్ట్ సమర్పించింది. ఇలాంటి గోదాములు గ్రేటర్ పరిధిలో 25 వేలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి ఇలాంటి భవనాలపై చర్యలు తీసుకుంటే పేదలు ఉపాధి కోల్పోతారని చెబుతున్నారు. కిమ్స్ సమీపంలోని ఆరంతస్తుల భవనంలోని రెండు సెల్లార్లలో ఒకదాంట్లో ‘దక్కన్ మాల్’ పేరుతో కార్పొరేట్ స్కూళ్ల యూనిఫారాల దుకాణం, ‘దక్కన్ నైట్‌వేర్’ పేరుతో స్పోర్ట్స్‌వేర్ స్టోర్ కొనసాగుతున్నాయి. రెండో సెల్లార్‌లో ప్రింటింగ్‌కు సంబంధించిన కలర్ కెమికల్స్ గోదాము ఉంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో కార్ డెకర్స్, సెల్లార్‌లో ఉన్న వస్త్ర దుకాణాలకు సంబంధించిన గోదాములు పైరెండు అంతస్తుల్లో ఉన్నాయి. ఈ షోరూంలను డీవీకాలనీకి చెందిన జావీద్ నిర్వహిస్తున్నారు. భవనం యజమాని రహీంఖాన్ 4, 5 అంతస్తుల్లో తమ కుటుంబం నివసించేందుకు వీలుగా ఇంటీరియర్ చేయిస్తున్నారు.
ఉదయం 10.30 సమయంలో కార్‌డెకర్స్‌లో షార్ట్ సర్క్యూట్ (Short circuit)తో మంటలంటుకున్నాయి. మొత్తం 40 ఫైరింజన్లతో సుమారు 9 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.. రాత్రి 7.30 సమయంలో మంటలను నియంత్రించారు. వసీం, జాఫర్, జునైద్ కోసం అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు యత్నించినా.. గోడలు ఇంకా వేడిగా ఉండడం.. భవనం గోడల ప్లాస్టరింగ్, పైకప్పు పెచ్చులుగా ఊడిపోతుండడంతో సాధ్యం కాలేదు. ‘‘ఆ ముగ్గురూ చనిపోయి ఉంటారని భావిస్తున్నాం’’ అని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కానీ, పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.
భవనాల కూల్చివేతపై ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 25న అన్ని శాఖలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టూరిస్ట్‌లాగా వచ్చి గాలి మాటలు మాట్లాడారని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని తలసాని విమర్శించారు.