Share News

HYD: డబ్బిస్తేనే ప్రచారానికి.. ఏ మీటింగ్‏కైనా వారే...

ABN , First Publish Date - 2023-11-16T09:01:10+05:30 IST

ఓట్ల పండగ నేపథ్యంలో ప్రధాన పార్టీల కార్యకర్తలకు గిరాకీ పెరిగింది. నిన్న మొన్నటి వరకు తమను పట్టించుకోని

HYD: డబ్బిస్తేనే ప్రచారానికి.. ఏ మీటింగ్‏కైనా వారే...

- కొన్ని నియోజకవర్గాల్లో వెలవెల పోతున్న పార్టీ కార్యాలయాలు

- స్థానిక కార్యకర్తల బెట్టు

- పొరుగు రాష్ట్రాల నుంచి రప్పించుకుంటున్న అభ్యర్థులు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఓట్ల పండగ నేపథ్యంలో ప్రధాన పార్టీల కార్యకర్తలకు గిరాకీ పెరిగింది. నిన్న మొన్నటి వరకు తమను పట్టించుకోని ముఖ్య నాయకులు, ప్రచారానికి రావాలని కొద్దిరోజులుగా బతిమలాడుతుండడంతో కార్యకర్తలు బెట్టు చేస్తున్నారు. కొన్ని పార్టీల కార్యకర్తలైతే.. ఏ రోజుకారోజు డబ్బిస్తేనే ప్రచారానికి వస్తామని, లేకుంటే వచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులకు చేతిచమురు వదులుతోంది. ఎన్నికలకు మరో రెండు వారాలు సమయం ఉండడం, ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉండడంతో.. అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థుల తీరు అలా ఉంటే.. కార్యకర్తలు మాత్రం డబ్బు చేతికి రాకుంటే.. ఇంట్లో కూర్చుంటామే కానీ, పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడమని చెబుతున్నారని సమాచారం. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాటు చేసుకున్న కార్యాలయాలు కార్యకర్తలు లేక వెలవెలబోతున్నాయి. నగర శివారులోని ఓ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఏర్పాటు చేసిన కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక్కరు కూడా లేరు. ఇది ఒక్క పార్టీకే పరిమితం కాకుండా అన్ని పార్టీ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాలకు స్థానిక కార్యకర్తలు పెద్దమొత్తంలో డిమాండ్‌ చేస్తుండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి రోజుకింత అని మాట్లాడి రప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-11-16T09:01:12+05:30 IST