Hyderabad: అంబులెన్స్‌కు అడ్డంగా గ్యాస్ సిలిండర్ల లారీ.. అరగంటపాటు ట్రాఫిక్‌కు ఆటంకాలు
ABN , Publish Date - Dec 31 , 2023 | 01:14 PM
నగరంలో ఎంత ట్రాఫిక్ జామ్ అయినా అంబులెన్స్(Ambulance) శబ్దం వినిపించిందంటే చాలు ఎలాగో అలా రోడ్డు క్లియర్ చేసి వాటిని గమ్యస్థానాలకు పంపిస్తుంటారు. అందులో ఉన్న రోగికి ఇబ్బంది కలగవద్దు
- రోగి ఇబ్బందిని పట్టించుకోని గ్యాస్ గోడౌన్ సిబ్బంది
బంజారాహిల్స్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): నగరంలో ఎంత ట్రాఫిక్ జామ్ అయినా అంబులెన్స్(Ambulance) శబ్దం వినిపించిందంటే చాలు ఎలాగో అలా రోడ్డు క్లియర్ చేసి వాటిని గమ్యస్థానాలకు పంపిస్తుంటారు. అందులో ఉన్న రోగికి ఇబ్బంది కలగవద్దు అని సామాన్యుడు ఆలోచిస్తుంటాడు. ఇందుకు భిన్నంగా రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్యాస్ గోదాం నిర్వాహకులు, సిబ్బంది ‘అంబులెన్స్ వస్తే మాకేంటి.. మా పని కావాలి’ అనే ధోరణి ప్రదర్శించారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్.66(Jubilee Hills Road No.66)లో బీఎస్ గ్యాస్ ఎంటర్ ప్రైజెస్ పేరిట ఓ గ్యాస్ కంపెనీ ఉంది. కార్యాలయానికి ఆనుకుని గ్యాస్ గోదాం కూడా ఉంది. ప్రతీ రోజు గ్యాస్ సిలిండర్లతో కూడిన పెద్ద లారీలు రావడం వల్ల నిత్యం ట్రాఫిక్ ఆటంకాలు ఏర్పడేవి. స్థానికులు పలుసార్లు విజ్ఞప్తి చేసినా సిబ్బంది మాత్రం పనితీరు మార్చుకోలేదు. శనివారం ఉదయం ఓ అంబులెన్స్ ఈ దారిలో వెళ్తుండగా గ్యాస్ గోదాంకు అప్పుడు పెద్ద లారీ వచ్చింది. అది మలుపు తీసుకొని గ్యాస్ గోదాంలోకి వెళ్లేందుకు సుమారు 15 నిమిషాల సమయం పట్టింది. అప్పటి వరకు అంబులెన్స్ ముందుకు కదలలేకపోయింది. లోపల ఉన్న రోగి ఇబ్బంది పడ్డాడు. అంబులెన్స్ ఎదురుగా ఉన్నప్పటికీ సిబ్బంది లారీని గోదాంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు తప్పితే, దారి ఇవ్వాలని ఆలోచించకపోవడం మిగతా వాహనదారులను విస్మయానికి గురి చేసింది. మరి ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు, అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి.