Hyderabad: ఎంఐఎం అభ్యర్థి అత్యుత్సాహం.. ఓటర్ స్లిప్‌లపై పార్టీ గుర్తు
ABN , First Publish Date - 2023-11-29T11:56:19+05:30 IST
యాకుత్‌పురా నియోజకవర్గం(Yakutpura Constituency)లో పోలింగ్ స్లిప్‌లపై పార్టీ గుర్తు ప్రచురించి ఓటర్లకు పంచడం దుమారాన్ని
- ప్రత్యేక యంత్రం ద్వారా ఓటర్ స్లిప్‌ల ముద్రణ, పంపిణీ
- ఎన్నికల సంఘానికి ఎంబీటీ అభ్యర్థి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): యాకుత్‌పురా నియోజకవర్గం(Yakutpura Constituency)లో పోలింగ్ స్లిప్‌లపై పార్టీ గుర్తు ప్రచురించి ఓటర్లకు పంచడం దుమారాన్ని రేపింది. పార్టీ గుర్తులతో ఉన్న స్లిప్‌లు పంచిన ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ మేరాజ్, ఆయన కార్యకర్తలుపై చర్యలు తీసుకోవాలంటూ ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లా ఖాన్(Anjadullah Khan) హైదరాబాద్ జిల్లా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గుర్తులుండటమే కాకుండా.. ప్రత్యేక యంత్రాన్ని తయారు చేసి... ఇంటింటికి వెళ్లి ఓటరు పేరు.. వివరాలతో కూడిన ప్రింట్‌ను యంత్రం ద్వారా తీసి పంచుతున్నారు. ఆ స్లిప్ పై భాగంలో గాలిపటం గుర్తు.. ఆ తర్వాత ఓటరు వివరాలు, పోలింగ్ బూత్ వివరాలున్నాయి. మజ్లిస్ అభ్యర్థి మేరాజ్, కార్యకర్తలు నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ, చేతిలో చిన్న యంత్రాన్ని పట్టుకుని స్పాట్‌లో పంచిన స్లిప్పులను ఆధారాలుగా ఆయన ఫిర్యాదు కాపీకి జతపరిచారు. ఇది ఎన్నికల నిబంధనకు విరుద్ధమని, అసలు ఓటర్ల డేటా ఎలా సేకరించారని, ఆ యంత్రంలో ఆ డేటా ఎలా చేరిందని, అసలు ఆ యంత్రం ఏంటనే ప్రశ్నలను అంజదుల్లా లేవనెత్తారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు.