Tragedy: బెంగళూరు సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీం లీడ్.. ఇలా జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా..!
ABN , First Publish Date - 2023-08-04T16:34:04+05:30 IST
కర్ణాటక రాజధాని బెంగళూరు పరిధిలోని కడుగోది ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో విగత జీవులుగా కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రాణాలు తీసుకున్న ఈ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు పరిధిలోని కడుగోది ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో విగత జీవులుగా కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రాణాలు తీసుకున్న ఈ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన వీరార్జున విజయ్ (31) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ తన భార్యాపిల్లలతో కలిసి కడుగోది ప్రాంతంలో ఫ్లాట్‌లో ఉంటున్నాడు. అతని భార్య పేరు హేమవతి (29). ఆరేళ్ల క్రితం వీరి పెళ్లి జరిగింది. ఈ భార్యాభర్తలకు మోక్ష మేఘనయన (రెండున్నరేళ్లు), సృష్టి సునయన (8 నెలలు) అనే ఇద్దరు ఆడ పిల్లలున్నారు. సీగేహల్లి సాయి గార్డెన్ అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఫ్లాట్‌లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది.
ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో విజయ్ టీం లీడ్‌గా పనిచేస్తున్నాడు. మంచి ప్యాకేజీతో చెప్పుకోతగిన వేతనమే అందుకున్నాడు. గత మంగళవారం నుంచి భార్యాభర్తలిద్దరి ఫోన్లు స్విఛాప్ వచ్చాయి. దీంతో.. హైదరాబాద్‌లో ఉంటున్న విజయ్ తమ్ముడు శేష సాయికి అనుమానమొచ్చింది. గురువారం ఉదయానికి విజయ్ తమ్ముడు బెంగళూరుకు వెళ్లాడు. తన అన్నయ్య కుటుంబం నివాసం ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లాడు. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ నొక్కినా లోపల నుంచి స్పందన లేదు. లోపల వైపు లాక్ చేసి ఉన్న విషయాన్ని శేష సాయి గ్రహించాడు. బెడ్‌రూంలో లైట్లు వెలిగి ఉండటాన్ని గమనించాడు. బయట వైపు నుంచి బెడ్రూం కిటికీని తీసి చూడగా తన అన్నయ్య, వదిన, ఇద్దరు పిల్లల మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి.
దీంతో.. షాక్‌కు గురైన శేషసాయి భోరున విలపిస్తూ ఇరుగుపొరుగుకు సమాచారం ఇచ్చాడు. పోలీసులకు ఆ అపార్ట్‌మెంట్‌వాసులు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. డోర్‌ను బద్ధలు కొట్టి మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. స్పాట్‌ను పరిశీలించిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం విజయ్ తన భార్యాపిల్లలను ఉరేసి చంపేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని చెప్పారు. ఈ ఘటన జూలై 31న అర్ధరాత్రి దాటాక జరిగి ఉండొచ్చని మృతదేహాలు కుళ్లిన స్థితిని చూస్తుంటే తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఎలాంటి డెత్ నోట్ స్పాట్‌లో లభ్యం కాలేదని వెల్లడించారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలు ఈ ఘోరానికి దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక ఈ ఘటనకు కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.