TSPSC Leakage: మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఏబీవీపీ యత్నం.. ఉద్రిక్తత
ABN , First Publish Date - 2023-03-28T12:23:11+05:30 IST
నగరంలోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని మినిస్టర్స్ క్వార్టర్స్ (Ministers quarters) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఏబీవీపీ (ABVP) విద్యార్థులు యత్నించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) కేసులో మంత్రి కేటీఆర్ (Minister KTR)ను బర్తరఫ్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. మినిస్టర్స్ క్వార్టర్స్ లోపలికి దూసుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజ్ కేసులో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశంలో విద్యార్థి సంఘాలు ప్రభుత్వ తీరును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న సిట్‌పై తమకు నమ్మకం లేదని చెబుతున్నారు. కేసును సీబీఐకు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రుల నివాసం ముట్టడికి ఏబీఎపీ విద్యార్థులు వచ్చారు. లోనికెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దానిపై స్పందించలేదని.. ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ (Telangana)లో కుటుంబపాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీ విషయంలో దాదాపు 30లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి విద్యార్థులు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవాలని.. అలాగే ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.