Hyderabad: కూతురికి పాల బాటిల్‌ కొనడానికి బయటకు వచ్చిన మహిళకు లిఫ్ట్ ఇచ్చినట్టే ఇచ్చి..

ABN , First Publish Date - 2023-07-04T11:00:02+05:30 IST

కూతురికి పాల బాటిల్‌ కొనడానికి బయటకు వచ్చిన మహిళకు.. తిరుగు ప్రయాణంలో ఓ వాహనదారుడు లిఫ్ట్‌ ఇచ్చాడు. మార్గమధ్యలో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె గత్యంతరం లేక బైక్‌పై నుంచి దూకేసింది. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న టిప్పర్‌ ఆ యువతిని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.

Hyderabad: కూతురికి పాల బాటిల్‌ కొనడానికి బయటకు వచ్చిన మహిళకు లిఫ్ట్ ఇచ్చినట్టే ఇచ్చి..

పాల కోసం వస్తే అసభ్య ప్రవర్తన

లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తి నిర్వాకం

బైక్‌పై నుంచి దూకిన యువతి

టిప్పర్‌ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై ఆస్పత్రిపాలు

వారం రోజులు గోప్యంగా ఉంచిన పోలీసులు

తార్నాక/హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): కూతురికి పాల బాటిల్‌ కొనడానికి బయటకు వచ్చిన మహిళకు.. తిరుగు ప్రయాణంలో ఓ వాహనదారుడు లిఫ్ట్‌ ఇచ్చాడు. మార్గమధ్యలో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె గత్యంతరం లేక బైక్‌పై నుంచి దూకేసింది. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న టిప్పర్‌ ఆ యువతిని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడా ప్రాంతానికి చెందిన మహిళ ఈనెల 27న తన పాప పాల కోసం తార్నాకలోని ఓ మెడికల్‌ షాప్‌కు వచ్చింది. అక్కడ బాటిల్స్‌ అయిపోవడంతో వెనుదిరిగి నడుచుకుంటూ వస్తూ వాహనదారుడిని లిఫ్ట్‌ అడిగి వెళ్తుంది. అతను మార్గమధ్యలో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అభ్యంతరం చెప్పి బైక్‌ ఆపమని కోరింది. అయినా వినకుండా వెళ్తుండగా ఆమె బైక్‌ నుంచి దూకింది. ఈ క్రమంలో తార్నాక యూ టర్న్‌ వద్ద ఒక్కసారిగా వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న కాంక్రీట్‌ లారీ ఢీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఓయూ పోలీసులు సోమవారం తెలిపారు.

బైక్‌ స్కిడ్‌ చేశాడు: బాధితురాలు

పాల బాటిల్‌ దొరక్కపోవడంతో తిరిగి వెళ్తున్నాను. అదే సయయంలో అక్కడ పోలీస్‌ వ్యాన్‌ అడ్డుగా ఆగి ఉంది. అది దాటుకొని వెళ్తుండగా.. అప్పుడే ఓ వ్యక్తి బైక్‌పై సికింద్రాబాద్‌ వైపు వెళ్తూ.. ‘ఏమైందమ్మా’ అని అడిగాడు. పాల బాటిల్‌ కోసం వస్తే స్టాక్‌ అయిపోయిందన్నారు. అందుకే వెళ్తున్న అని చెప్పిన. దాంతో నేనూ అటే వెళున్నాను. నా బైక్‌ పై డ్రాప్‌ చేస్తాను అని బైక్‌ ఎక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే మార్గ మధ్యలో అసభ్యంగా మాట్లాడాడు. అన్న నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పినా వినలేదు. బైక్‌ ఆపితే దిగిపోతానని చెప్పినా ఆపలేదు. చెప్పినట్లు వినకపోతే బైక్‌ను స్కిడ్‌ చేసి పడేస్తాను అని బెదిరించాడు. అన్నట్లుగానే బెదిరించి చేతిలో ఫోన్‌ లాక్కొని, కిందపడేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏదో లారీ వచ్చి ఢీ కొట్టింది.

పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన..

ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. తమకు ఎలాంటి న్యాయం జరగడంలేదని బాధిత కుటుంబ సభ్యులు సోమవారం ఓయూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వాగ్వాదానికి దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల తరపున ఓ కార్పొరేటర్‌ రంగంలోకి దిగి పోలీసులతో మాట్లాడటంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిసింది. నిందితుడిని కాపాడి, కేసును నీరుగార్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-07-04T11:00:10+05:30 IST