గల్ఫ్‌లో బీజేపీ ఉగాది సభల రచ్చ

ABN , First Publish Date - 2023-03-20T03:08:44+05:30 IST

మిషన్‌ తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ గల్ఫ్‌ దేశాల్లోని ప్రవాసీయులకు చేరువవుతున్న నేపథ్యంలో ఉగాది సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

గల్ఫ్‌లో బీజేపీ ఉగాది సభల రచ్చ

ప్రవాసీయుల్లో అంతర్గత కలహాలు

ఖతర్‌లో రద్దయిన ఆత్మీయ సమ్మేళనం

దుబాయిలో జరిగిన రఘునందన్‌ సభ

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): మిషన్‌ తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ గల్ఫ్‌ దేశాల్లోని ప్రవాసీయులకు చేరువవుతున్న నేపథ్యంలో ఉగాది సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖతర్‌లోని తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా శుక్రవారం భారీ ఎత్తున ఆత్మీ య సమ్మేళనం నిర్వహించేందుకు గత కొన్నిరోజులుగా సన్నాహాలు చేశారు. అయితే, కార్యక్రమానికి రెండు రోజుల ముందు సభకు ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ కన్వీనర్‌ గడ్డె భూమన్న పేర్లతో వెలిసిన కరపత్రాలు కలకలం రేపాయి. రాజకీయ పార్టీ నాయకులు ప్రసంగిస్తారని ఖతర్‌లోని సభాస్థలి యాజమాన్యానికి కొందరు సమాచారమివ్వడంతో వారు సభనిర్వహణకు నిరాకరించారు. సభకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని కూడా సూచించినట్లు సమాచారం.

ఖతర్‌ సహా గల్ఫ్‌దేశాల్లో రాజకీయ పార్టీలతో సభలు నిర్వహించడం నిషేధం. ఈ క్రమంలో ఖతర్‌లోని తెలంగాణ ప్రవాసీయుల్లో ఉన్న అంతర్గత కలహాల కారణాన ఈ సమాచారమిచ్చారని తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక రఘునందన్‌ రావు దుబాయికి వెళ్లిపోయారు. దుబాయిలోని ఓ పాఠశాలలో ఆదివారం జరిగిన ఉగాది ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కొందరు బీజేపీ ముఖ్య నేతలు కూడా దుబాయికి వచ్చారు. కాగా, ఇది పార్టీతో సంబంధం లేని కార్యక్రమమని, దుబాయిలో ఒక వ్యక్తిగత కార్యక్రమం నిమిత్తం ఈటల రాజేందర్‌తో కలిసి రఘునందన్‌ రావు పాల్గొనాల్సి ఉన్నా రాజేందర్‌ రాలేదని, రఘునందన్‌ రావు మాత్రమే వచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఖతర్‌లో గద్దె భూమన్న సోదరుడు కూడా పని చేస్తుండడంతో వారి కోరిక మేరకు ఖతర్‌కు వెళ్లారని కానీ అంతర్గత సమస్యల కారణాన సభకు అనుమతి లేకపోవడంతో రఘునందన్‌ రావు పాల్గొనకుండా దుబాయికి వెళ్లిపోయారని వివరించాయి. అక్కడ కార్యక్రమం విజయవంతమైందని కూడా వారు చెప్పారు.

Updated Date - 2023-03-20T03:09:31+05:30 IST