Bonalu Festival: బోనాల ఉత్సవాలకు ప్రైవేట్ ఆలయాలకు సర్కార్ ఆర్థిక సాయం... దరఖాస్తు చేసుకోవాలన్న మంత్రి తలసాని

ABN , First Publish Date - 2023-06-01T12:21:44+05:30 IST

రాష్ట్ర పండుగ బోనాలు ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.

Bonalu Festival: బోనాల ఉత్సవాలకు ప్రైవేట్ ఆలయాలకు సర్కార్ ఆర్థిక సాయం... దరఖాస్తు చేసుకోవాలన్న మంత్రి తలసాని

హైదరాబాద్: రాష్ట్ర పండుగ బోనాలు ఉత్సవాలు (Bonalu Festival) మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం కోసం వారం రోజుల్లో ఆలయ కమిటీలు దరఖాస్తులు అందజేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) తెలిపారు. ఆషాడ బోనాల ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.15 కోట్లను కేటాయించారు. బోనాల నిర్వహణ కోసం ప్రతి ఏటా ప్రైవేటు దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. బోనాలకు ముందే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

కాగా.. ప్రతి సంవత్సరం గోల్కొండలో బోనాల ఉత్సవాలు ప్రారంభమై తర్వాత సికింద్రాబాద్ బోనాలు, ఓల్డ్ సిటీ బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జూన్ 22న గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభంకానున్నాయి. ఆ తరువాత జూలై 9న సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు, 16న పాతబస్తీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపులు జరుగనున్నాయి. బోనాలు పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబుకానున్నాయి.

Updated Date - 2023-06-01T12:21:44+05:30 IST