TCongress: రైతు సమస్యలపై హెచ్ఆర్సీకి టీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు..
ABN , First Publish Date - 2023-04-03T14:16:45+05:30 IST
హైదరాబాద్: రైతు సమస్యలపై హెచ్ఆర్సీ (HRC)కి తెలంగాణ కాంగ్రెస్ నేతలు (TCongress Leaders) పొన్నం ప్రభాకర్, కోదండ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: రైతు సమస్యలపై హెచ్ఆర్సీ (HRC)కి తెలంగాణ కాంగ్రెస్ నేతలు (TCongress Leaders) పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), కోదండ రెడ్డి (Kodanda Reddy), అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) ఫిర్యాదు చేశారు. ధరణి సమస్యలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెచ్ఆర్సీ కలగజేసుకుని రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు.
ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భూ పోరాటాలకు తెలంగాణ పెట్టింది పేరని, ఊరు గొప్ప పేరు దిబ్బలా ధరణి పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ధరణి సమస్యపై వేల అప్లికేషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ధరణి సమస్యపై ఛీఫ్ సెక్రటరీకి, సీఎం కేసీఆర్ (CM KCR)ల దృష్టికి పలు సార్లు తీసుకువెళ్లామన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. రాష్ట్ర హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశామన్నారు. జాతీయ హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ భూములు పంచిపెడితే.. భూధాన్ భూములను హెచ్‌ఎండీఏ అమ్ముకుంటోందని కోదండ రెడ్డి అన్నారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ధరణితో ఇబ్బంది పడుతున్న వారంతా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలలో నిలదీయాలని పిలుపిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ధరణిని రద్దు చేస్తామన్నారు. రైతులను ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం మానవ హక్కుల ఉల్లంఘనేనని అన్నారు.
రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. నిజమైన హక్కు దారులలో చాలా మందికి ధరణిలో లబ్ది జరగలేదని ఆరోపించారు. సమస్య ఉందని తెలిసి మరీ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులను వివరాలతో సహా హెచ్‌ఆర్సీకి ఇచ్చామన్నారు. ధరణి సమస్యలపై బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మెళనాలలో రైతులు నిలదీయాలని అన్వేష్ రెడ్డి పిలుపిచ్చారు.