Foxconn: ఫాక్స్‌కాన్‌.. హైదరాబాద్‌లోనే

ABN , First Publish Date - 2023-03-07T02:45:21+05:30 IST

ప్రపంచంలోనే అతి పెద్ద ఎలకా్ట్రనిక్స్‌ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌ తమ పెట్టుబడులను తెలంగాణలోనే పెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమవారం ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ చైర్మన్‌ యంగ్‌ లియు లేఖ రాశారు.

Foxconn: ఫాక్స్‌కాన్‌..   హైదరాబాద్‌లోనే

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఏర్పాటు

స్పష్టం చేసిన సంస్థ చైర్మన్‌ యంగ్‌ లియు

సీఎం కేసీఆర్‌కు లేఖ.. సహకారం అభ్యర్థన

కంపెనీ స్థాపనపై గందరగోళానికి ముగింపు

హైదరాబాద్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అతి పెద్ద ఎలకా్ట్రనిక్స్‌ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌ తమ పెట్టుబడులను తెలంగాణలోనే పెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమవారం ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ చైర్మన్‌ యంగ్‌ లియు లేఖ రాశారు. గత గురువారం జరిగిన సమావేశంలో చెప్పినట్లుగా.. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తయారీ కేంద్రం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. అక్కడి పారిశ్రామిక పార్కులో కార్యకలాపాలు త్వరగా ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. హైదరాబాద్‌లో తమకు అందించిన అతిఽథ్యానికి యంగ్‌ లియు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అతిథ్యం ఆకట్టుకున్నదని, కేసీఆర్‌ స్వదస్తూరితో.. తన పుట్టినరోజు సందర్భంగా అందించిన గ్రీటింగ్‌ కార్డు అమితానందం కలిగించిందని పేర్కొన్నారు. ‘‘నాకిప్పుడు భారత దేశంలో కొత్త స్నేహితుడు ఉన్నారు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా.

అభివృద్ధి దిశగా తెలంగాణ పురోగమించడానికి మీరు చేస్తున్న కృషి, కనబరుస్తున్న దార్శనికత నుంచి స్ఫూర్తి పొందాను’ అని కొనియాడారు. తైవాన్‌కు రావాలంటూ కేసీఆర్‌కు ఆహ్వానం పంపారు. త్వరలో కలవాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ ప్రకటనతో ఆ సంస్థ భారతదేశంలో కొత్త పెట్టుబడుల గమ్యస్థానం ఏమిటో స్పష్టమైంది. ఎన్ని ఎకరాల్లో చేపడతారు, మొదటి దశలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నది త్వరలో తేలనుంది. కాగా, కంపెనీ ఏర్పాటు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై యంగ్‌ లి యు ఈ నెల 2న ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కంపెనీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఒప్పందం కుదిరిందని, హైదరాబాద్‌లో ఏర్పాట చేయబోయే ప్లాంట్‌తో పదేళ్లలో లక్ష ఉద్యోగాలు వస్తాయని సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో పెట్టుబడుల విషయంలో ఆశావహ దృక్పథంతో ఉన్నామని ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ పేర్కొన్నారని కూడా తెలిపింది. అదే రోజు సాయంత్రం టి-వర్క్స్‌ను యంగ్‌ లి యు ప్రారంభించారు.

ఆ సమయంలో పదేళ్లలో లక్షమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు ఆయనకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆ మరుసటి రోజే కర్ణాటక సీఎం బొమ్మై సైతం ఇదే తరహా ప్రకటన చేశారు. తమ రాష్ట్రంలో ఫాక్స్‌కాన్‌ భారీ పెట్టుబడులు పెట్టబోతోందని, లక్షమందికి ఉద్యోగాలు రానున్నాయని అన్నారు. మరోవైపు ఫాక్స్‌కాన్‌ గత శనివారం స్పందిస్తూ.. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి తమ ఛైర్మన్‌ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని తెలిపింది. ఛైర్మన్‌ ఫిబ్రవరి 27 నుంచి మార్చి-4 వరకు భారత్‌లో పర్యటించినా కొత్త ఉద్యోగాలకు సంబంధించి సంస్థ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదంది. దీంతో గందరగోళం నెలకొంది. సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం ద్వారా యంగ్‌ లి యు దీనికి తెరదించారు.

Updated Date - 2023-03-07T02:45:21+05:30 IST