Share News

Harish Rao: కేంద్రం నుంచి రావలసిన నిధులు రాకపోవడం వల్లే రాష్ట్రానికి ఇబ్బంది..

ABN , Publish Date - Dec 20 , 2023 | 02:00 PM

హైదరాబాద్: కేంద్రం నుంచి రావలసిన రూ. లక్ష కోట్లు రాకపోవడం వల్ల ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బంది కలిగిందని, ఎస్‌వీపీలను అప్పులుగా తప్పుగా చూపించారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లఘు చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ..

Harish Rao: కేంద్రం నుంచి రావలసిన నిధులు రాకపోవడం వల్లే రాష్ట్రానికి ఇబ్బంది..

హైదరాబాద్: కేంద్రం నుంచి రావలసిన రూ. లక్ష కోట్లు రాకపోవడం వల్ల ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బంది కలిగిందని, ఎస్‌వీపీలను అప్పులుగా తప్పుగా చూపించారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లఘు చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తన హామీల నుంచి తప్పించుకోవడానికి దారులు వెతుక్కుంటున్నట్లుగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడానికి కుకుడ్ స్టోరీ తయారు చేశారని, ఆర్థిక పరిస్థితిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇది కూర్చున్న కొమ్మను నరక్కుంటున్నట్లేనని, దీనివల్ల పెట్టుబడులు రాకుండా పోతాయన్నారు. ప్రభుత్వమే దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేస్తే పెట్టుబడులు ఆగుతాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని, ఇది మూర్ఖత్వం.. మూఢత్వమని అన్నారు.

రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని దివాలా తీసినట్లు చెబుతున్నారని, ప్రభుత్వ శ్వేతపత్రంలో కొత్త విషయాలు ఏమీ లేవని హరీష్‌రావు అన్నారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఈ అంశాలపై గతంలోనే సభలో మాట్లాడారని, ఏ ప్రభుత్వం వద్ద డబ్బులు కట్టల రూపంలో బీరువాల్లో ఉండవని అన్నారు.

కాగా హరీష్‌రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ గోబెల్స్ ప్రచారం చేశారని, ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి కల్పించారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

శ్వేత పత్రం చూస్తే రాజకీయం, ప్రత్యర్థులపై దాడి కోనమే కనిపిస్తుందని, గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ధోరణితో ప్రభుత్వం ఉందని హరీష్‌రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 41 శాతం ఖర్చు పెట్టారనడం శుద్ధ అబద్ధమన్నారు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక రిటైర్ అయిన ఏపీ అధికారులతో తప్పుడు శ్వేత పత్రం తయారు చేయించారని ఆరోపించారు.

అప్పుల విధానాన్ని ప్రభుత్వం తప్పుగా చూపించిందని, తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు దేశంలో ఉన్నాయని హరీష్‌రావు అన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం తాము ఆస్తులను పెంచామని, సొంత ఆదాయ వనరుల వృద్ధిలో దేశంలో నెంబర్ వన్ స్థానానికి తెలంగాణను తీసుకువెళ్లామన్నారు. మెడికల్ అండ్ హెల్త్ కోసం ఆరు రెట్లు అధికంగా ఖర్చు చేశామన్నారు. అప్పులు పెంచామని మాపై బురద జల్లుతున్నారు.. కరోనా కారణంగా ఆదాయం తగ్గిందని, ఆ సమయంలో కేంద్రం అప్పులు తీసుకునే వెసులుబాటు కల్పించిందని అన్నారు. హరీష్‌రావు కామెంట్‌పై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 20 , 2023 | 02:00 PM