Hyderabad Traffic: గచ్చిబౌలి చౌరస్తా వైపు వెళుతుంటే మాత్రం ఈ వార్త మీకోసమే..!

ABN , First Publish Date - 2023-07-31T16:07:14+05:30 IST

ఖాజాగూడ దాటి ఐకియా నుంచి వెళ్లాలన్నా, గచ్చిబౌలి వద్ద ఓఆర్‌ఆర్‌ దిగి కొత్తగూడ మీదుగా వెళ్లాలన్నా, సైబర్‌ టవర్స్‌ మీదుగా హైటెక్‌ సిటీ చేరాలన్నా.. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లాలన్నా.. ఒకటే సీన్‌. ట్రాఫిక్‌.. ట్రాఫిక్‌. ఏ ప్రాంతంలో అయినా కనీసం గంట పడుతుంది. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరానికి కూడా అంత టైమ్‌ పడుతుందంటే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Hyderabad Traffic: గచ్చిబౌలి చౌరస్తా వైపు వెళుతుంటే మాత్రం ఈ వార్త మీకోసమే..!

ట్రాఫిక్ తంట.. మినిమమ్ గంట..

మూడు, నాలుగు కిలోమీటర్లకే..

అటు నుంచి ఇటయినా.. ఇటు నుంచి అటయినా..

ఐకియా - హైటెక్‌ సిటీ, సైబర్‌ టవర్స్‌, శిల్పారామం.. అన్ని చోట్లా అదే పరిస్థితి

బాటిల్‌ నెక్‌గా మారుతున్న రోడ్లు

ఖాజాగూడ దాటి ఐకియా నుంచి వెళ్లాలన్నా, గచ్చిబౌలి వద్ద ఓఆర్‌ఆర్‌ దిగి కొత్తగూడ మీదుగా వెళ్లాలన్నా, సైబర్‌ టవర్స్‌ మీదుగా హైటెక్‌ సిటీ చేరాలన్నా.. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లాలన్నా.. ఒకటే సీన్‌. ట్రాఫిక్‌.. ట్రాఫిక్‌. ఏ ప్రాంతంలో అయినా కనీసం గంట పడుతుంది. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరానికి కూడా అంత టైమ్‌ పడుతుందంటే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలి చౌరస్తా నుంచి ఎటు వెళ్లాలన్నా వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సి వస్తోంది. ఆ కొంత దూరం దాటితే చాలురా బాబు అనుకుంటూ వేచి చూడాల్సి వస్తోంది. విశాలంగా ఉన్న రోడ్లలో సైతం వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నానక్‌రామ్‌గూడ ఐటీ జోన్‌, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు రోజూ రాకపోకలు సాగించే వారి వాహనాల రద్దీకి అనుగుణంగా చాలా చోట్ల రహదారుల విస్తీర్ణం చేపట్టారు. కానీ, కొన్ని ప్రాంతాలను పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

ప్రధానంగా మెహిదీపట్నం, మల్కంచెరువు, జూబ్లీహిల్స్‌, మణికొండ వైపు నుంచి రాయదుర్గం మీదుగా గచ్చిబౌలి, మాదాపూర్‌ ఐకియా వైపు వచ్చే వాహనాలతో పాటు, షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ పై నుంచి వచ్చే వాహనాలు దాబా సర్కిల్‌ వద్దకు వచ్చే సరికి రోడ్డు బాటిల్‌ నెక్‌ మాదిరిగా ఇరుకుగా తయారవుతోంది. మల్కం చెరువు నుంచి రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ దాటే వరకు, దివ్య శ్రీ ఐటీ పార్కు వరకు రోడ్డు ఇరుకుగా ఉంది. దీంతో అక్కడి వరకు వేగంగా వచ్చే వాహనాలు ఆటోమేటిక్‌గా స్లోగా వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో క్షణాల వ్యవధిలో కిలోమీటర్‌ మేర ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. అలాగే గచ్చిబౌలి సర్కిల్‌, సైబరాబాద్‌ కమిషనరేట్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు రాయదుర్గం దాబా సర్కిల్‌ వద్దకు వచ్చే సరికి కూడా రోడ్డు ఇరుకుగా ఉండటంతో వేగం తగ్గుతోంది.

ఐకియా సర్కిల్‌లో ఇదీ పరిస్థితి

దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ వైపు నుంచి, మాదాపూర్‌ ఐటీ జోన్‌లోని ఐటీ కంపెనీల నుంచి వచ్చే వారు గచ్చిబౌలి, ల్యాంకో హిల్స్‌ మణికొండ, ఖాజాగూడ, రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు, ఔటర్‌ రింగురోడ్డు వైపు వెళ్లేందుకు ఐకియా సర్కిల్‌ మీదుగా వెళ్లాలి. దీంతో ఆ సర్కిల్‌లో విపరీతమైన ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది.

అరకిలోమీటరుకు అరగంట

ఆ ఒక్కరోడ్డు వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఐటీ హబ్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు చేరుకునే వాహనాల్లో మూడొంతుల వాహనాలు ఈ రోడ్డు ద్వారానే వచ్చి వెళ్తుంటాయి. కొత్తగూడ, కొండాపూర్‌, చందానగర్‌, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, బాచుపల్లి లాంటి కీలక ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ఆ రోడ్డు ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎస్‌ఆర్‌డీపీ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆ రోడ్డును మూసి వేశారు. అరకిలోమీటర్‌ మేర నిర్మాణ పనులు సాగుతుండటంతో ఆ రోడ్డుకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఆ రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్పులతో ఆ అర కిలోమీటర్‌ రోడ్దు దాటాలంటే.. అరగంట పడుతోంది. ఇది ఆ రోడ్డు వినియోగించే వాహనదారులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.


ఇతర ప్రాంతాలపైనా..

ప్రత్యామ్నాయాలపై పూర్తి స్థాయి ఫోకస్‌ చేయకుండానే రోడ్డు మూసివేయడంతో వాహనదారులు అసహనానికి గురవుతున్నారు. దానికి తోడు కొత్తగూడ, గచ్చిబౌలిల మధ్య ప్రత్యామ్నాయ దారుల్లో ట్రాఫిక్‌ పెరగడంతో.. దాని ప్రభావం కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ రోడ్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా రోడ్లపై ప్రతి చౌరస్తాలో కనీసం అరగంట కేటాయిస్తే తప్ప ముందుకు వెళ్లలేని దుస్థితి. ప్రధానంగా సైబర్‌ టవర్స్‌, ఐకియా, కొత్తగూడ, కొండాపూర్‌ నుంచి ఎయిర్‌పోర్టు వెళ్లాల్సిన వాహనదారులు సైతం నేరుగా ఔటర్‌ రింగ్‌రోడ్డు చేరుకోడానికి అవకాశం లేకపోవడంతో రాడిసన్‌, ఏఐజీ, డెలాయిట్‌, ఐకియా ద్వారా గచ్చిబౌలి చౌరస్తా చేరి, లెఫ్ట్‌.. సైబరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయం దాటిన తర్వాత యూటర్న్‌ తీసుకుని ఔటర్‌ ఎక్కాల్సిన పరిస్థితి. షేక్‌పేట్‌ మెహదీపట్నం వెళ్లాల్సిన వాహనదారులు యూటర్న్‌ కాకుండా నేరుగా వెళ్లే అవకాశమున్నా ఖాజాగూడ వద్ద ఆగాల్సిందే. కొత్తగూడ, కొండాపూర్‌ నుంచి టీఎల్‌ఎఫ్‌, విప్రో, నానక్‌రామ్‌గూడ వైపు వెళ్లాల్సిన ఐటీ ఉద్యోగులు, ఇతర వాహనదారులు సైతం సమయం.. ఇంధనం వృథా చేయడమే కాదు.. తమ కార్యాలయాలకూ ఆలస్యంగా చేరుకుంటున్నారు.

జేఎన్‌టీయూ వరకు ఎఫెక్ట్‌

ఫ్లైఓవర్‌ కోసం ట్రాఫిక్‌ అధికారులు మళ్లింపులు చేపట్టడంతో ఆ ప్రభావం కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ రోడ్ల వరకు పడింది. ఐటీ కారిడార్‌కు వెళ్లే టూ, ఫోర్‌ వీలర్స్‌ నెమ్మదిగా వెళ్తుండటంతో గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోతున్నారు. హఫీజ్‌పేట్‌ నుంచి గోపాల్‌నగర్‌ మీదుగా కేపీహెచ్‌బీ ఇందూ ఫార్చూన్‌ వద్ద ఆర్‌యూబీ వద్ద, జేఎన్‌టీయూ నుంచి హైటెక్‌సిటీ వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2023-07-31T16:07:18+05:30 IST