Jubilee Hills: ఫిలింనగర్‌, జర్నలిస్టు కాలనీ, కేబుల్‌ బ్రిడ్జి వంతెన కింద యూటర్న్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళుతుంటారా..?

ABN , First Publish Date - 2023-06-24T07:01:41+05:30 IST

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కష్టాలు మరింత తీవ్రంగా ఉన్నాయి. వంద మీటర్ల ప్రయాణానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Jubilee Hills: ఫిలింనగర్‌, జర్నలిస్టు కాలనీ, కేబుల్‌ బ్రిడ్జి వంతెన కింద యూటర్న్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళుతుంటారా..?

100 మీటర్ల ప్రయాణానికి 20 నిమిషాలు

జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ నరకం

యూటర్న్‌ల మార్పుతో సమస్య జటిలం

అడుగడుగునా వాహనదారుల ఇక్కట్లు

క్రమబద్ధీకరణలో ట్రాఫిక్‌ పోలీసులు విఫలం

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే ట్రాఫిక్‌ ఇక్కట్లు అర్ధరాత్రి కూడా కొన్ని చోట్ల వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కష్టాలు మరింత తీవ్రంగా ఉన్నాయి. వంద మీటర్ల ప్రయాణానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పడిన జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొందరైతే రోడ్డుపక్కన చాటుగా కూర్చొని చలానాల కోసం ఫొటోలు తీయడానికి పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పెరిగిన సమస్యలు

ట్రాఫిక్‌ నియంత్రణకు, రోడ్డు ప్రమాదాల నివారణకు నగర ట్రాఫిక్‌ పోలీసులు కొన్నాళ్ల క్రితం ఆపరేషన్‌ రోప్‌ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా అనేక ప్రాంతాల్లో యూటర్న్‌లను మూసివేసి, కొత్తగా యూటర్న్‌లను సృష్టించారు. కొన్ని ప్రాంతాల్లో సక్సెస్‌ అయిన ఆపరేషన్‌ రోప్‌.. జూబ్లీహిల్స్‌లో మాత్రం ఇబ్బందికరంగా మారింది. కొత్త ప్రయోగం వల్ల బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. ఫిలింనగర్‌, జర్నలిస్టుకాలనీ, కేబుల్‌ బ్రిడ్జి వంతెన కింద యూటర్న్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపునకు వెళ్లే వాహనదారులు అడుగడుగునా అవస్థలు పడుతున్నారు. 100 మీటర్ల దూరానికి 15 - 20 నిమిషాలు పడుతోందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. తప్పనిస్థితిలో చాలా ప్రాంతాల్లో వాహనదారులు రాంగ్‌రూట్‌ యూటర్న్‌లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కార్లు ఎక్కడికక్కడ ఆగిపోయి ట్రాఫిక్‌ మరింత జటిలంగా మారి వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

పాత పద్ధతే బెటర్‌

మార్చిన యూటర్న్‌ల వల్ల వాహనదారులు ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతున్నా.. అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం పట్టించుకోవట్లేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారు. పాత పద్ధతిలోనే ట్రాఫిక్‌ సులభంగా వెళ్లేదని, కొత్త పద్ధతితో కొత్తగా ట్రాఫిక్‌ చిక్కులు పెరిగాయి తప్పా, సమస్య పరిష్కారం కాలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-06-24T07:01:45+05:30 IST