Hyderabad: హైదరాబాద్‌లో ఉంటున్న వీళ్లకు ఇది పండగ లాంటి వార్తే..!

ABN , First Publish Date - 2023-03-10T15:01:31+05:30 IST

ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదల ఇంటిస్థలాల క్రమబద్ధీకరణ కోసం సర్కార్‌ మరో..

Hyderabad: హైదరాబాద్‌లో ఉంటున్న వీళ్లకు ఇది పండగ లాంటి వార్తే..!

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూముల్లో(Government land) ఇళ్లు నిర్మించుకున్న పేదల ఇంటిస్థలాల క్రమబద్ధీకరణ కోసం సర్కార్‌ మరో అవకాశం కల్పించింది. జీవో 59 కింద దరఖాస్తు చేసుకునేందుకు నెలపాటు గడువు విధిస్తూ మంత్రిమండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో నివాస స్థలాల క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపులకు చాన్స్‌ లభిస్తుండడంతో పాత వారితోపాటు మరో లక్ష కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. 2014 నాటికి సర్కారు స్థలాల్లోని గుడిసెలు, ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు జారీ చేసిన జీవో 58, 59లకు అనుగుణంగా 2022లో ప్రభుత్వం మరో జీవో 14 (GO.14)జారీ చేసింది. దీంతో గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌(Hyderabad), రంగారెడ్డి(Rangareddy), మేడ్చల్‌(Medchal) జిల్లాలో దాదాపు 1.15 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 54 వేల దరఖాస్తులను ఆమోదించినా హక్కు పత్రాలు అందించలేదు. కాగా, క్యాబినెట్‌ తాజా నిర్ణయంతో మిగిలిన దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఏదైనా రుజువు చూపితే చాలు..

గ్రేటర్‌ పరిధి జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పక్కా ఇళ్లు నిర్మించుకుని రెగ్యులైజేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోకుండా 1.10 లక్షల మంది దాకా ఉన్నారు. అయితే గతంలో 2014 వరకు దరఖాస్తులను ఆమోదించగా, ప్రస్తుతం 2020 వరకు కూడా ఆక్రమణలో ఉన్నట్లు రుజువులు చూపిస్తే ఇంటి స్థలాల హక్కు పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2020 నాటికి ఆక్రమణలో కట్టిన ఇంటికి సంబంధించిన కరెంట్‌, తాగునీటి, విద్యుత్‌ బిల్లు, ఆస్తిపన్ను.. తదితరాల్లో ఒకటి చూపుతూ దరఖాస్తు చేసుకుంటే క్రమబద్ధీకరణ జరగనుంది. వాస్తవంగా ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను రెగ్యులైజేషన్‌ చేసేందుకు 2008 ఫిబ్రవరి 16న జీవో 166 జారీ చేశారు. దీంతో హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 1,22,637 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి.

అయితే ఇందులో చాలా కుటుంబాలు సరైన ఆధారాలు చూపించలేదంటూ తిరస్కరించారు. సరిగ్గా కొన్నింటికి కన్వేయన్స్‌ డీడ్‌(Deed of Conveyance) కింద (హక్కు బదలాయింపు పత్రం) కూడా అందజేశారు. అయితే అప్పటి సీపీఎం నాయకులు హైకోర్టు(High Court)ను ఆశ్రయించడంతో జీవో 166 కింద క్రమబద్ధీకరణను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ స్థలాలను రెగ్యులరైజ్‌ (Regularize) చేసేందుకు జీవో 58, 59 జారీ చేశారు. అనంతరం జీవో 179, 134 జారీ చేసి కూడా స్థలాలను క్రమబద్ధీకరించారు. 2022లో జీవో 14 కింద మరో అవకాశం కల్పించారు. తాజాగా మరోసారి చాన్స్‌ ఇవ్వడంతో పెండింగ్‌ దరఖాస్తుదారులు సంతోషపడుతున్నారు. ఈసారైనా హక్కు పత్రాలు పొంది స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Updated Date - 2023-03-10T15:06:39+05:30 IST