Hyderabad: బఫర్ జోన్ తేలేదెన్నడు?
ABN , First Publish Date - 2023-03-20T03:31:00+05:30 IST
హైదరాబాద్‌కు దక్షిణాన శ్రీశైలం హైవే పక్కన ముచ్చర్ల గ్రామం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా సిటీ చుట్టుపక్కల ఆర్నెల్లుగా రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది. అమ్మకాలు కొనుగోళ్లు దాదాపుగా ఆగిపోయాయి.
ముచ్చెర్ల ఫార్మాసిటీ చుట్టూ నిలిచిన రియాల్టీ.. ఆర్నెల్ల క్రితం వరకు జోరుగా క్రయ విక్రయాలు
ఫార్మాసిటీ చుట్టూ ఏడు కిలోమీటర్ల మేర లేఅవుట్ అనుమతులు బంద్
పరిధిపై తేల్చకుండా నాన్చుతున్న సర్కార్
దక్షిణ హైదరాబాద్ రియాల్టీపై ప్రభావం
హైదరాబాద్ సిటీ, మార్చి19(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు దక్షిణాన శ్రీశైలం హైవే పక్కన ముచ్చర్ల గ్రామం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా సిటీ చుట్టుపక్కల ఆర్నెల్లుగా రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది. అమ్మకాలు కొనుగోళ్లు దాదాపుగా ఆగిపోయాయి. నిజానికి ఆర్నెల్ల క్రితం వరకు కూడా ఫార్మాసిటీ పేరు చెప్పుకొని జోరుగా భూములు అమ్ముకున్నారు. మొత్తం దక్షిణ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కే ఈ ప్రాజెక్టు జోష్ తీసుకొచ్చింది. తాజాగా ఏర్పడిన ఈ స్తబ్ధతకు కారణం ఫార్మాసిటీచుట్టుపక్కల నివాస ప్రాంతాలు లేకుండా చూసే ‘బఫర్ జోన్’ ఎంతమేర ఉండాలనేది తేలకపోవడమే. ఫార్మాసిటీ ఏర్పాటుకు నిర్దేశించిన సర్వే నంబర్ల నుంచి చుట్టూ ఏడు కిలోమీటర్ల మేర బఫర్ జోన్ ఉండాలనేది ఒక ప్రతిపాదన. మూడు లేదా ఐదు కిలోమీటర్ల మేర ఉన్నా సరిపోతుందన్న ఆలోచన కూడా ఉంది. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఖరారు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ తేల్చకుండా తాత్సారం చేస్తోంది.
అయితే, ఇదే సమయంలో ముందు జాగ్రత్తగా ఫార్మాసిటీ చుట్టూ ఏడు కిలోమీటర్ల పరిధిలో హెచ్‌ఎండీఏ లేఅవుట్లకు, భవనాలకు, గోదాములకు అనుమతి ఇవ్వకుండా నిషేధం పెట్టింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల పరిధిలోని కొంతభాగంలో ఈ నిషేధం అమల్లో ఉంది. దాంతో వేల ఎకరాల మేర రియల్ ఎస్టేట్ పూర్తిగా ఆగిపోయింది. ఎకరాల లెక్కన కొనేవాళ్లు కూడా బఫర్ జోన్ తేలేదాకా వేచిచూద్దాం అని ఆగుతున్నారు. బఫర్ జోన్‌లో నివాస ప్రాంత లేఅవుట్లు వేయడం కుదరదు. కేవలం పరిశ్రమలు, గోదాములు పెట్టుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాంటి భూములకు నివాస లేఅవుట్లతో పోలిస్తే పెద్దగా రేటు ఉండదు.
దాంతో ఇప్పటికే కోట్లు పెట్టి భూములు కొన్న వాళ్లంతా తమ భూమి బఫర్ జోన్ లోపల ఉంటుందా? బయట ఉంటుందా? అనేది తేలక టెన్షన్ పడుతున్నారు. ఎక్కువ మంది మాత్రం ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టదని, బఫర్ జోన్‌ను 3 కిలోమీటర్లకే పరిమితం చేస్తుందని గట్టి విశ్వాసంతో ఉన్నారు. అదే సమయంలో బఫర్ జోన్ తేలే వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. ఫార్మాసిటీ రియల్ ఎస్టేట్ డౌన్ కావడం సెంటిమెంట్ పరంగా మొత్తం దక్షిణ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీదే ప్రభావం చూపుతోంది. పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు ఫార్మా సిటీ మాస్టర్‌ప్లాన్‌కు బఫర్ జోన్‌ను నిర్ణయిస్తూ హెచ్‌ఎండీఏ గత డిసెంబరులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆ తర్వాత ఎందుకో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో
ఫార్మాసిటీ విస్తీర్ణం మొత్తం 19,333 ఎకరాలు. అందులో ప్రభుత్వ భూమి 9,123 ఎకరాలు. 10,210 ఎకరాల వరకు ప్రైవేటు భూములను సేకరించాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చెర్ల, మీర్‌ఖాన్‌పేట, పంజగూడ గ్రామాలు, యాచారం మండలంలోని కుర్మిద్ద, మేడపల్లి, నానక్‌నగర్, తాడిపత్రి గ్రామాలు, కడ్తాల్ మండలం ముద్విన్, కర్కల్‌పహడ్, కడ్తాల్ గ్రామాల్లో ఫార్మాసిటీ కోసం భూసేకరణ జరిపే సర్వే నంబర్లను ఇప్పటికే గుర్తించారు. ఇప్పటికే సేకరించిన భూముల్లో రోడ్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు, డైన్రేజీ తదితర మౌలిక సదుపాయాల కల్పన పనులు టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఎకో సిస్టమ్ అభివృద్ధికి ప్రముఖ ఏజెన్సీ ద్వారా ఫార్మా సిటీ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫార్మాసిటీని నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)గా గుర్తించింది. పర్యావరణ అనుమతులు సైతం మంజూరయ్యాయి.
రియల్ కుదేల్
ఫార్మాసిటీ శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల దూరంలో, ఔటర్ రింగ్ రోడ్డుకు 16 కిలోమీటర్ల దూరంలో, షాద్‌నగర్ రైల్వేస్టేషన్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల పరిధిలోని పలు రెవెన్యూ గ్రామాలు టీఎ్‌సఐఐసీ పరిధిలోకి వెళ్లగా, ఆయా సర్వే నెంబర్లను అనుకొని ఉన్న ప్రాంతాలన్నీ బఫర్‌జోన్‌గా చేయాలని నిర్ణయించారు. దాంతో ప్రాంతమంతా 111 జీవో తరహా వాతావరణం నెలకొంది. ఫార్మాసిటీని నమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ భారీగా భూములు కొని, లేఅవుట్ అనుమతుల కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేశారు. ఉన్నతస్థాయి ఆదేశాలతో అనుమతులు నిలిపివేయడంతో భారీ ఎత్తున దరఖాస్తులు పెండింగులో పడ్డాయి. లేఅవుట్ అనుమతుల ద్వారా ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయమూ ఆగిపోయింది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత లేఅవుట్ల అనుమతులు రాకపోవడంతో రియల్టర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.