Hyderabad: మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా? ఈ పొరపాటు చేయకండి!
ABN , First Publish Date - 2023-11-17T12:57:28+05:30 IST
ఆ తర్వాత ఓ యాప్ ద్వారా ఖాతాకు డబ్బులు వచ్చాయని తెలుసుకుని, ఆ ఖాతాలోకి తిరిగి జమ చేశాడు. డబ్బును వెంటనే తిరిగి చెల్లించినప్పటికీ...
ప్రమేయం లేకుండానే ఖాతాలోకి డబ్బులు
తిరిగి చెల్లించినా వేధింపులు..
పోలీసులను ఆశ్రయించిన యువకుడు
హైదరాబాద్ సిటీ, నవంబర్ 16 (ఆంధ్రజ్యోతి): మరో పది రోజుల్లో పెళ్లి. ఆ ఏర్పాట్లలో నిమగ్నమైన యువకుడికి లోన్ చెల్లించాలంటూ ఫోన్లు.. మెస్సేజ్‌లు. తాను అప్పు తీసుకోలేదని, ఎందుకు ఫోన్ చేస్తున్నారని ప్రశ్నిస్తే.. యాప్ ద్వారా లోన్ తీసుకున్నట్లు ఆధారాలు చూపుతూ బ్లాక్‌మెయిలింగ్. యూట్యూబ్ చూస్తూ కనిపించిన లింక్ నొక్కడంతో చిక్కుకున్నానని గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కేపీహెచ్‌బీ పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఓ కంపెనీలో పని చేసే యువకుడు ఇటీవల యూట్యూబ్ వీక్షిస్తున్న సమయంలో అనుకోకుండా ఓ లింక్ క్లిక్ చేశాడు. ఓపెన్ అయిన యాప్‌లో వారు చెప్పినట్లే వివరాలు నమోదు చేశాడు. అది రుణయాప్ అని, దాంతో అతను చిక్కుల్లో ఇరుక్కుంటానని ఊహించలేదు. నిమిషాల వ్యవధిలో అతడి ఖాతాలోకి రూ. 38 వేలు జమ అయ్యాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు.
ఆ తర్వాత ఓ యాప్ ద్వారా ఖాతాకు డబ్బులు వచ్చాయని తెలుసుకుని, ఆ ఖాతాలోకి తిరిగి జమ చేశాడు. డబ్బును వెంటనే తిరిగి చెల్లించినప్పటికీ... లోన్ చెల్లించాలని వేధింపులు ప్రారంభమయ్యాయి. తాను లోన్‌కు దరఖాస్తు చేసుకోలేదని, తన ఖాతాలో పడ్డ డబ్బును తిరిగి ఇచ్చేశానని చెప్పినా ఆగలేదు. డబ్బు చెల్లించాలని, లేకుంటే డబ్బు తీసుకుని చెల్లించడం లేదని అతడి ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి మెసేజ్‌లు పంపిస్తామని బెదిరించసాగారు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. పది రోజుల్లో పెళ్లి ఉందని, ఏదైనా పొరపాటు జరిగితే పరువుపోతుందని వారికి మొరపెట్టుకున్నాడు.