BJP: కిషన్‌రెడ్డి, రఘునందన్‌ అరెస్ట్.. ఓఆర్‌ఆర్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-07-20T12:04:41+05:30 IST

బాటసింగారంకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్‌రెడ్డి శంషాబాద్‌ఎయిర్‌పోర్టు నుంచి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి బాటసింగారంకు బయలుదేరారు.

BJP: కిషన్‌రెడ్డి, రఘునందన్‌ అరెస్ట్.. ఓఆర్‌ఆర్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: బాటసింగారంకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని (Union Minister Kishan Reddy) పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్‌రెడ్డి శంషాబాద్‌ఎయిర్‌పోర్టు నుంచి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో (MLA Raghunandan rao) కలిసి బాటసింగారంకు బయలుదేరారు. బాట సింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్ళను పరిశీలించేందుకు కేంద్రమంత్రి అక్కడకు పయనమయ్యారు. అయితే కేంద్రమంత్రి అయిన కిషన్‌రెడ్డిని అడ్డుకుంటారా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఎయిర్‌పోర్టు పరిధి దాటగానే వాహనాలను అడ్డుపెట్టి మరీ కేంద్రమంత్రి కాన్వాయ్‌ను పోలీసులు ఆపేశారు. దీంతో పోలీసులతో కిషన్ రెడ్డి, రఘునందనరావు వాగ్వివాదానికి దిగారు. అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి.. కేంద్రమంత్రిని అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు, నాయకులు భగ్గుమంటున్నారు. చివరకు బలవంతంగా కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కాగా.. బీజేపీ చలో బాటసింగరాం పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ నేతలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల సహా.. బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనుమతి లేనందున బీజేపీ నేతలెవరూ బాట సింగారం రావొద్దని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2023-07-20T12:10:22+05:30 IST