Avinash Reddy: వివేకా హత్య కేసులో సీబీఐకి హైకోర్టు సూటి ప్రశ్న ఏంటంటే..
ABN , First Publish Date - 2023-05-27T11:44:27+05:30 IST
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందోస్తు బెయిల్‌పై రెండో రోజు శనివారం విచారణ జరుగుతోంది.
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Muder Case)లో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి Avinash Reddy) ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులోవాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అవినాష్, సునీత (Sunitha) తరపు వాదనలు ముగిశాయి. ఇవాళ తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో సీబీఐ (CBI) తరపు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అవినాశ్‌ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని, విచారణకు అవినాష్ సహకరించడం లేదని, ఎన్నిసార్లు నోటీసులిచ్చినా అవినాశ్‌రెడ్డి పట్టించుకోవడం లేదని సీబీఐ తరపున వాదిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ పేర్కొన్నారు.
దర్యాప్తు విషయంలో ఎవరి మెప్పు మేరకు సీబీఐ వ్యవహరించదని, తమ దర్యాప్తుకు ఒక స్టైల్ ఉంటుందని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. దర్యాప్తు సందర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్ కావాలని అవినాష్ అడిగారని, విచారణకు ఎక్కడా అవినాష్ రెడ్డి సహకరించడం లేదని చెప్పారు. ఎప్పుడు నోటీసు ఇచ్చినా 3 నుంచి 4 రోజుల సమయం కావాలని అడుగుతూ వచ్చారన్నారు. ఏప్రిల్ 17న, మే 15న నోటీస్ ఇచ్చామని, అప్పుడు కోర్టుల చుట్టూ తిరిగి పిటిషన్‌లు వేశారని తెలిపారు. మిగతా ఆరుగురు నిందితులు కూడా విచారణకు హాజరయ్యారని.. కానీ అవినాష్ రెడ్డి మాత్రం విచారణకు హజరు కావడం లేదన్నారు. మిగతా నిందితులతో పోలిస్తే అవినాష్ రెడ్డికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? మిగతా నిందితులు విచారణకు సహకరిస్తున్నప్పుడు అవినాష్ రెడ్డి ఎందుకు సహకరించడం లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక సామాన్యుడు నిందితుడు అయి ఉంటే ఇంత ఆలస్యంగా దర్యాప్తు ఉండేదా? అని న్యాయస్థానం సీబీఐని సూటిగా నిలదీసింది.
రెండు రకాల నేరాలకు నిందితులు పాల్పడ్డారని ఒకటి వివేక మర్డర్.. రెండోది క్రైమ్ సీన్ డిస్ట్రక్షన్ అని సీబీఐ తెలిపింది. ఈ కుటుంబం ఎంత పవర్ ఫుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసునని, అంత పవర్ ఫుల్ ఫ్యామిలీ నుంచి పోటీ చేసి వివేకా ఓడిపోవడం అంటే ఇది కచ్చితంగా కుట్రేనని సీబీఐ పేర్కొంది. 800 ఓట్ల తేడాతోనే అని అవినాష్ న్యాయవాది చెప్పడం హాస్యాస్పదమన్నారు.
అయితే వివేక హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారని.. ప్రధాన కారణం ఏంటని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. వివేకా హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందని, వివేకా హత్య రాజకీయ కారణాలతోనే జరిగిందని సీబీఐ పేర్కొంది. అవినాశ్ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనక కుట్ర జరిగిందని సీబీఐ తెలిపింది. ఎంపీ అవినాశ్ రెడ్డి రాజకీయంగా శక్తిమంతుడైతే.. వివేకాను చంపాల్సిన అవసరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. కాగా సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ శర్మ హైకోర్టులో కేసు విచారణకు హాజరై వాదనలు వింటున్నారు. అలాగే వివేకా కుమార్తె సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా వాదనలు వింటున్నారు. ప్రస్తుతం హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.