Selfie suicide: హైదరాబాద్‌లో బైక్ షోరూమ్ యజమాని సెల్ఫీ సూసైడ్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-05-31T11:19:47+05:30 IST

భాగ్యనగరంలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన హీరో షోరూమ్ యజమాని నరేష్ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

Selfie suicide: హైదరాబాద్‌లో బైక్ షోరూమ్ యజమాని సెల్ఫీ సూసైడ్.. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్: భాగ్యనగరంలో సెల్ఫీ సూసైడ్ (Selfie suicide) కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన హీరో షోరూమ్ యజమాని నరేష్ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు నరేష్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తాను ఎవరి వల్ల ఆత్మహత్య చేసుకున్నారో, ఆత్మహత్యకు గల కారణాలను సెల్ఫీ వీడియోలో నరేష్ వివరించారు. ప్రతాప్ అనే వ్యక్తి చేతిలో మోసపోయానంటూ నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే... కథలాపూర్ మండల కేంద్రంలో నరేష్ బైక్‌ షోరూమ్ నడుపుతున్నారు. ఇందులో భాగంగా వివిధ స్కీమ్‌ల ద్వారా వాహనాలను విక్రయించారు. ఈ మధ్య కాలంలో నరేష్ ఆరు స్కీంలను ప్రారంభించారు. అయితే మొదటి రెండు స్కీంలు దిగ్విజయంగా పూర్తి చేశాడు. మరో నాలుగు స్కీంలు మిగిలి ఉండగా.. వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో వ్యాపార నిమిత్తం వివిధ ప్రాంతాలకు తిరగాల్సిన అవసరం ఉండటంతో తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న ప్రతాప్ అనే వ్యక్తిని స్కీంలకు ఇన్‌చార్జ్‌గా నియమించారు. ప్రతాప్‌ పేరుపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఖాతాను కూడా తెరిపించాడు. అప్పటి నుంచి లావాదేవీలన్నీ కూడా ప్రతాప్ పేరు మీద జరుగుతున్నాయి. ఈ నాలుగు స్కీంల కింద సుమారు 350 వాహనాలను విక్రయించారు.

అయితే వాహనాలకు సంబంధించిన నగుదను నరేష్‌కు ఇవ్వడంలో ప్రతాప్ మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో నరేష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అలాగే వివిధ స్కీంల ద్వారా ప్రజల వద్ద నుంచి దాదాపు కోటి 90 లక్షలను తీసుకున్నారు. డబ్బులు ఇచ్చిన వారి నుంచి నరేష్‌కు ఒత్తిడి పెరిగింది. స్కీమ్‌లో డబ్బులు కట్టిన బాధితులను ప్రతాప్ మోసం చేశాడని నరేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతాప్ చేతిలో మోసపోయి, ఆర్థికంగా చితికిపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ నరేష్‌ సెల్ఫీ వీడియోలో వివరించాడు. స్కీమ్ డబ్బుల విషయంలో నరేష్‌ను వేధిస్తున్నారని, ప్రతాప్ వల్లనే నరేష్ ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-05-31T11:19:47+05:30 IST