Swarnalatha Bhavishyavani: ఈ ఏడాది స్వర్ణలత భవిష్యవాణి ఏం చెప్పారంటే...
ABN , First Publish Date - 2023-07-10T10:04:26+05:30 IST
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూసే రంగం కార్యక్రమం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ చెప్పే భవిష్యవాణి ప్రారంభమైంది. మాతంగి స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్పారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి (secunderabad ujjaini mahankali temple) లష్కర్ బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూసే రంగం కార్యక్రమం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ చెప్పే భవిష్యవాణి ప్రారంభమైంది. మాతంగి స్వర్ణలత (Mathangi Swarnalatha) పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్పారు. ‘‘ఈ ఏడాది పూజలను ఎలాంటి లోపం లేకుండా సంతోషంగా అందుకున్నాను. గతేడాది నాకు మాట ఇచ్చి ఎందుకు మరిచిపోయారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను, మీతోనే నేను ఉంటాను. వర్షాలు వస్తాయి కానీ కొంచం ఒడిదుడుకు అవుతుంది. అగ్నిప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. నా వద్దకు వచ్చిన ప్రజలను సుఖసంతోషాలతో చూసుకునే భారాన్ని మోస్తాను. ఐదు వారాల పాటు నాకు సాక పెట్టాలి. నైవేద్యం, టెంకాయ కొట్టాలి. ప్రతీ గడపను కాపాడే బాధ్యత నాదే. ఏది బయట పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. ఇవన్నీ కడుపులో దాచుకొనేది నేనే.. తప్పనిసరిగా నాలోనే దాచుకొని ఉంటాను.. మీరు చేసే పూజలు అందుకుంటాను.. వచ్చే ఏడాది అన్ని పూజలు జరిపించండి..’’ అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
మరోవైపు రంగం కార్యక్రమం చూసి భవిష్యవాణిని వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రంగం కార్యక్రమం కోసం ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత ఏడాది ప్రభుత్వంపై, అధికారులపై అమ్మవారు కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. తన నిధులు కాజేస్తున్నారంటూ అమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అంబారీపై ఊరేగించనున్నారు. ఆ తరువాత పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఆకర్షణీయంగా నిలవనున్నాయి. సాయంత్రం పోటెళ్ళతో పలహరం బండ్లు...ఊరేగింపు జరుగనుంది.