T.Highcourt: కమ్మ, వెలమ సంఘాలకు భూముల కేటాయింపు జీవో 47పై హైకోర్టు స్టే
ABN , First Publish Date - 2023-06-28T13:57:52+05:30 IST
కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబరు 47పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.
హైదరాబాద్: కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబరు 47పై తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt) స్టే ఇచ్చింది. 2021లో కమ్మ, వెలమ కుల సంఘాలకు చెరి ఐదు ఎకరాల భూములు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బలమైన కులాలకు భూకేటాయింపులు సరికాదంటూ ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (బుధవారం) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రభుత్వమే కులాలను పెంచి పోషిస్తుందా? .. హైటెక్ రాష్ట్రం తెలంగాణలో ఇదేం పద్ధతి?.. 21వ శతాబ్దంలోనూ ఇలాంటి విధానాలు సరికాదంటూ హైకోర్టు తీవ్ర వాఖ్యలు చేసింది. కుల సంఘాలకు ప్రభుత్వ భూములను కేటాయించడం అసంబద్ధమైన విధానమని న్యాయస్థానం పేర్కొంది. సమాజంలో అణగారిన వర్గాలకే ప్రభుత్వాలు భూములను కేటాయించాలని రాజ్యాంగంలో ఉందని హైకోర్టు దర్మాసనం వెల్లడించింది.