Telangana: ఆ 5 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో తెలంగాణ

ABN , First Publish Date - 2023-03-13T22:10:18+05:30 IST

తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది.

Telangana: ఆ 5 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో తెలంగాణ
Telangana on top in India in ODF plus

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు, రికార్డులతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు మరోసారి అవార్డు పంట పండింది. దేశంలో ఓ డి ఎఫ్ ప్లస్ లో మన రాష్ట్రమే నెంబర్ వన్ గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 4 తాజా (మార్చి 12, 2023) సర్వేల్లో మరోసారి తెలంగాణ ప్రతిభ తేటతెల్లమైంది. ఓ డి ఎఫ్ ప్లస్ (ODF plus) గ్రామాలు, ఇండ్ల విభాగాల్లో 100 శాతం స్వచ్చత కనబరిచింది. స్వచ్ఛ సర్వే క్షణ్ గ్రామీణ సర్వే లోనూ 100 శాతం స్వచ్ఛత ను నమోదు చేసింది. దేశంలో అత్యధిక టాయి లెట్స్ ఉన్న 5 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. అయితే, ఇదంతా కేవలం 9 ఏళ్ళ లోపే జరిగింది. ఇంత తక్కువ కాలంలో అత్యంత ప్రతిభ కనబరచిన తెలంగాణ ఈ మైలు రాయిని దాటడం విశేషం. ఇదిలా ఉండగా, మన పల్లె సీమలు మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచాయి. డబుల్ ఇంజన్‌తో పని లేకుండానే డబుల్ ప్రతిభను ప్రదర్శించాయి. ఇదే విషయాన్ని వ్యక్తం చేస్తూ, డబుల్ ఇంజన్ కు, డబుల్ పని చేస్తున్న సర్కార్లకు ఇదీ తేడా... అంటూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన టీమ్‌ని అభినందించారు. మరోవైపు సీఎం దార్శనిక పథకం పల్లె ప్రగతి ద్వారానే ఇది సాకారం అయిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు గ్రామాలన్నీ బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్లస్‌ విభాగంలో చేరాయి. తాజాగా మార్చి 12, 2023 నాటికి పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వ 4 సర్వేల ప్రకారం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓ డి ఎఫ్ +), స్వచ్ఛ సర్వే క్షణ రెండు విభాగాల్లో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నూటికి నూరు శాతం స్వచ్ఛత సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ రెండు విభాగాల్లోనూ మొదటి 5 రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా ఉంది. మేరకు ఓడీఎఫ్‌ ప్లస్‌గా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వసతులు, మౌలిక సదుపాయాలతో తెలంగాణ పల్లెలు దేశంలో ముందువరుసలో నిలిచాయి. ఇటీవల ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల పురోగతి వివరాలను నమోదు చేయడానికి కేంద్రం అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ అధికారులు గ్రామాల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల వివరాలను అప్‌లోడ్‌ చేశారు.

ఓడీఎఫ్‌ ప్లస్‌ అంటే

కేవలం మరుగుదొడ్లను నిర్మించుకుంటే ఓడీఎఫ్‌గా ప్రకటిస్తారు. ఆ తరువాతి దశ అయిన ఓడీఎఫ్‌ ప్లస్‌గా గుర్తింపు పొందాలంటే గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించడం, ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుల్లో తడి పొడి చెత్తగా వేరు చేయడం, ప్రతి గ్రామానికి చెత్తను సేకరించడానికి ట్రాక్టర్‌ సమకూర్చడం, శ్మశాన వాటికను నిర్మించడం, ఇంకుడు గుంతలు నిర్మించడం వల్ల రోడ్లపై నీళ్లు నిలవకుండా చేయడం వంటి కార్యకలాపాలు చేపట్టాలి. ఈ అన్ని విభాగాల్లోనూ మన రాష్ట్రం దేశంలో ముందుంది కాబట్టే, ఈ అవార్డులు వస్తున్నాయి.

ఇదంతా కెసిఆర్ - పల్లె ప్రగతి ద్వారానే: మంత్రి దయాకర్‌రావు

రాష్ట్రంలోని దాదాపుగా అన్ని గ్రామాలు ఓడీఎఫ్‌ ప్లస్‌ పరిధిలోకి రావడం సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లె ప్రగతి ద్వారానే సాధ్యమైందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. రాష్ట్రంలోని గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన హర్షం ప్రకటించారు.

అవార్డులు సరే, నిధులు, ప్రోత్సాహకాలు ఏవి?

ప్రశంసలు, అవార్డులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి, అవార్డులు, రికార్డులతో పాటు నిధులు కూడా ఇవ్వాలని కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగస్వాములై దేశానికి ఆదర్శంగా నిలిచిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఇతర ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, తన సిబ్బంది, గ్రామ పంచాయతీల సిబ్బందికి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పేరు పేరునా ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.

గతంలోనూ...అవార్డులు

గతంలోనూ స్వచ్ఛ, పారిశుధ్య, ఇ- పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు, బహిరంగ మల మూత్ర రహిత రాష్ట్రంగా, ఉత్తమ ఆడిటింగ్ వంట అంశాలతో పాటు 100 శాతం నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా, అనేకానేక అవార్డులు, రివార్డులు వచ్చాయన్నారు. అలాగే ఆయా అంశాల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మిగతా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసిఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్లు వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.

Updated Date - 2023-03-13T22:10:22+05:30 IST