TS News: అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ స్పీకర్, మండలి చైర్మన్ నివాళి
ABN , First Publish Date - 2023-04-14T11:40:40+05:30 IST
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని విగ్రహం వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,
హైదరాబాద్: బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి (Babasaheb Ambedkar Jayanti) సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని విగ్రహం వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Telangana Speaker Pocharam Srinivas Reddy) , మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender reddy), శంబీపూర్ రాజు, గొంగిడి సునీత, ప్రభాకర్, బండ ప్రకాష్, భాను ప్రసాద్, వాణి దేవి తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం మొక్క నాటారు.
అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ... 125 అడుగుల విగ్రహం తెలంగాణలో ఆవిష్కరించుకోవడం గర్వకారణమన్నారు. దళిత బంధు అందరికీ అమలు అవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రతీ దళిత బిడ్డకు దళితబంధు అందాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. దళితబంధుకు స్ఫూర్తి అంబేద్కర్ అని చెప్పుకొచ్చారు. ప్రతీ దళిత కుటుంబం అభివృద్ధి చెందాలనుదే కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. కొందరు రాజకీయ నేతలు పబ్బం గడుపుకోవడానికి ఏవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హితవుపలికారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ కల్పించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెచ్చుకున్న తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఒక విప్లవంగా చూడాలన్నారు. అప్పుడప్పుడు రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని.. దాన్ని అందరూ కాపాడుకోవాలని అన్నారు.