TS 10th Paper Leak: రేపటి టెన్త్ పరీక్షలపై విద్యాశాఖ డైరెక్టర్ నిర్ణయం ఇదే..!
ABN , First Publish Date - 2023-04-03T20:43:10+05:30 IST
టెన్త్ పరీక్షల పేపర్ లీక్(10th Paper Leak) వ్యవహారం తెలంగాణ(Telangana)లో కలకలం రేపిన ...
టెన్త్ పరీక్షల పేపర్ లీక్(10th Paper Leak) వ్యవహారం తెలంగాణ(Telangana)లో కలకలం రేపిన విషయం తెలిసిందే.. మొదటి రోజే పేపర్ లీక్ కావడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. రేపటి నుంచి జరగాల్సిన మిగతా పరీక్షలు వాయిదా పడతాయని సోషల్ మీడియాలో కథనాలు వస్తుండటంతో ఆందోళనకు చెందుతున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రేపటి నుంచి జరగబోయే అన్ని టెన్త్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ప్రకటించారు. ఈనెల 13 వరకు టెన్త్ అన్ని పరీక్షలు ఎలాంటి మార్పులు లేకుండా నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాగా టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో తెలంగాణ విద్యాశాఖ సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంలో బాధ్యులైన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ప్రకటించారు. వాట్సాప్ ద్వారా పేపర్‌ను బయటకు పంపిన ఉపాధ్యాయుడు బందప్ప, మరో ఇన్విజిలేటర్ సమ్మప్ప, చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ గోపాల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్లు దేవసేన తెలిపారు.
10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.. టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం మరువక ముందే టెన్త్ పేపర్ లీక్ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలో NSUI, యూత్ కాంగ్రెస్ నాయకులు SSC బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. ఒక్కసారిగా విద్యార్థి సంఘాల నేతలు SSC బోర్డు కార్యాలయం వద్ద చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం బోర్డు, గేట్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. 10వ తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వరుస లీకేజీలో అటు ఉద్యోగార్ధులు, ఇటు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విద్యాశాఖ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.. బాధ్యులైన నలుగురు ఉద్యోగులను సస్పండ్ చేసింది. రేపటి నుంచి జరగాల్సిన టెన్త్ ఎగ్జామ్స్ యథాతథంగా నిర్వహిస్తామని ప్రకటించింది..ఈనెల 13వరకు జరిగే టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేదని తెలిపింది.