TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీ లీకేజీలో కొనసాగుతున్న సిట్ విచారణ.. తాజాగా మరొకరి అరెస్ట్
ABN , First Publish Date - 2023-03-27T12:08:35+05:30 IST
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఓ వైపు సిట్ విచారణ.. మరోవైపు అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసు (TSPSC Paper Leakage Case)లో ఓ వైపు సిట్ విచారణ.. మరోవైపు అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్య నాయక్, కేతావత్ రాజేశ్వర్‌లను రెండో రోజు కస్టడీలో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులను సిట్ ఆరు రోజుల పాటు కస్టడీలో విచారించింది. సిట్ అధికారుల నోటీసులతో... విచారణ అధికారి ముందుకు 100 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులు క్యూ కట్టారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించిన కొందరు అభ్యర్థులకు నిందితులతో సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించారు.
మరొకరి అరెస్ట్...
మరోవైపు ఈ కేసులో నిందితుల జాబితా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రేణుక సొంత మండలం సల్కర్ పేటకు చెందిన తిరుపతయ్యను ఏఈ పరీక్ష పేపర్ అందినట్లు విచారణ తేలింది. తిరుపతయ్య ఉపాధి హామీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఢాక్యా నాయక్ దగ్గర నుంచి ఏఈ పేపర్ తీసుకొని రాజేంద్రకుమార్‌కు తిరుపతయ్య అమ్మినట్లు విచారణలో బయటపడింది. దీంతో తిరుపతయ్యను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతయ్యతో పాటు మరికొందరిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కాగా.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులకుపైగా వచ్చిన వారి లిస్ట్‌ను సిట్ అధికారులు సిద్ధం చేశారు. టీఎస్‌పీఏస్సీ బోర్డ్ నుంచి అభ్యర్థుల సమాచారాన్ని స్వీకరించిన సిట్... 100 మార్కులుపైన వచ్చిన అభ్యర్థులను కార్యాలయానికి రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో నిన్న 20 మంది అభ్యర్థులు సిట్ ఆఫీస్‌లో విచారణకు హాజరయ్యారు. అలాగే మరికొందరు అభ్యర్థులు ఈరోజు విచారణ కోసం సిట్ కార్యాలయానికి వస్తున్నారు. సిట్ కార్యాలయానికి వచ్చిన అభ్యర్థి నుంచి అధికారులు 15 అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు. అభ్యర్థి బయోడేటాతో పాటు ఎంతవరకు చదివారు, ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు వంటి అంశాలను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. సమాచారం సేకరించిన అనంతరం అవసరమైతే తిరిగి సంప్రదిస్తామని అభ్యర్థులకు సూచిస్తున్నారు.