TSPSC Leakage: సిట్ విచారణలో సంచలనాలు వెలుగులోకి... మరో నలుగురి అరెస్ట్.. బ్లాక్ టికెట్ల మాదిరిగా..
ABN , First Publish Date - 2023-03-27T15:11:54+05:30 IST
టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసు (TSPSC Paper Leakage Case) లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు (SIT Officials).. మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏఈ ప్రశ్నాపత్రాన్ని నిందితులు డాక్యా అండ్ గ్యాంగ్ బ్లాక్ టికెట్ల మాదిరిగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేయడానికి పెట్టిన ఖర్చును తిరిగి సమకూర్చుకునే క్రమంలో చెయిన్ ప్రాసెస్‌లో కొనుగోలు పెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. షాద్‌నగర్‌కు చెందిన రాజేంద్రకు రూ.10 లక్షలు ఒప్పందం కింద డాక్యా ఏఈ పేపర్ అమ్మినట్లు తెలిసింది. ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన రాజేంద్ర.. ఆ పేపర్‌ను వేరొకరికి విక్రయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒకరి నుంచి ఒకరికి దాదాపు వంద మందికి ప్రశ్నాపత్రం చేరినట్లు భావిస్తున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. కాగా రేణుక, డాక్యా నుంచి అత్యధికంగా పాలమూరు పరిసర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు పేపర్ వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు.
సుదీర్ఘ విచారణ...
ఇక ఈ కేసులో నలుగురు నిందితులను సిట్ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్, కేతావత్ రాజేశ్వర్‌లను సుధీర్ఘంగా విచారిస్తున్నారు. వారు బస చేసిన హోటల్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. గ్రూప్ - 1 ప్రిలిమినరీ పరీక్షలో 100 మార్కుల కంటే ఎక్కువ సాధించిన 20 మంది అభ్యర్థుల వివరాలను కూడా సేకరించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులను సిట్ ఆరు రోజుల పాటు కస్టడీలో విచారించింది. సిట్ అధికారుల నోటీసులతో... విచారణ అధికారి ముందుకు 100 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులు క్యూ కట్టారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించిన కొందరు అభ్యర్థులకు నిందితులతో సంబంధాలు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
టీఎస్‌పీఎస్సీ దిద్దుబాటు చర్యలు
ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనతో టీఎస్‌పీఎస్సీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆఫీస్‌లోకి సెల్‌ఫోన్‌లు, పెన్‌డ్రైవ్‌లు తీసుకురావద్దని నిషేధం విధించింది. ఇకపై ఏ ఫిర్యాదైనా ఆన్‌లైన్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రత్యేక ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.