TSPSC Case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

ABN , First Publish Date - 2023-05-05T10:47:51+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు.

TSPSC Case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో (TSPSC Leakage Case) మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. భగవంత్‌కుమార్, అతని తమ్ముడు రవికుమార్‌‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తన తమ్ముడు రవికుమార్ కోసం డాక్యా నుంచి ఏఈ పేపర్‌ను భగవంత్ కుమార్ కొనుగోలు చేశాడు. ఏఈ పేపర్‌ను ఇచ్చేందుకు డాక్యా నాయక్ రూ.2 లక్షలకు బేరం పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. డాక్యా నాయక్ బ్యాంక్ లావాదేవీలను సిట్ అధికారులు పరిశీలించగా.. భగవంత్‌ నుంచి రూ.1.75 లక్షలు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. భగవంత్‌రావును అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు విచారించగా.. తన తమ్ముడు రవికుమార్ కోసం పేపర్ కొన్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో భగవంత్‌కుమార్, రవికుమార్‌ ఇద్దరినీ సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్‌తో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితుల సంఖ్య 22కు చేరుకుంది.

కీలక విషయాలు వెలుగులోకి...

మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. కొందరు నగదు తీసుకోగా మరికొందరు బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్‌కు రూ.16 లక్షలు అందినట్టు సిట్ గుర్తించింది. ప్రవీణ్ కుమార్ ద్వారా రేణుక రాథోడ్ పది లక్షలకు ఏఈ ప్రశ్నాపత్రం అందుకున్నారు. ఏఈ ప్రశ్నాపత్రాన్ని రేణుక భర్త డాక్యా, రాజేశ్వర్లు కలిసి మరో ఐదుగురికి విక్రయించినట్టు దర్యాప్తులో బయటపడింది. ఈ పేపర్‌ను విక్రయించడం ద్వారా రాజేశ్వర్, డాక్యాలకు రూ.27.4 లక్షలు వచ్చినట్టు సిట్ అధికారులు తేల్చారు. ఇందులో నుంచి రూ.10 లక్షలు ప్రవీణ్ కుమార్‌కు ఇవ్వగా... రాజేశ్వర్, డాక్యాలకు రూ.17.4 లక్షలు వచ్చాయి. మరోవైపు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రశ్నాపత్రాన్ని ఖమ్మంకు చెందిన దంపతులకు రూ.6 లక్షలకు ప్రవీణ్ విక్రయించాడు. డీఏఓ పేపర్ అమ్మగా వచ్చిన ఆరు లక్షల సొమ్మును ప్రవీణ్ బ్యాంకులో దాచగా.. ఆ సొమ్మును సిట్ అధికారులు స్తంభింపజేశారు. ప్రశ్నాపత్రాలు అమ్మగా వచ్చిన డబ్బుతో రాజేశ్వర్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేశాడు. మరోవైపు గ్రూప్ అండ్ ప్రశ్నాపత్రాన్ని ప్రవీణ్, రాజశేఖర్ ఉచితంగానే ఇచ్చినట్టు సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.

Updated Date - 2023-05-05T10:48:14+05:30 IST