K Viswanath Live Updates : అభిమానజనసందోహం మధ్య ముగిసిన అంత్యక్రియలు

ABN , First Publish Date - 2023-02-03T07:42:20+05:30 IST

దర్శకుడు అంటే దార్శనికుడు! విడుదలయ్యాక ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే స్రష్ట.. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట!! ఆ విద్యలో కె.విశ్వనాథ్‌ ఎవరెస్ట్‌.

K Viswanath Live Updates :  అభిమానజనసందోహం మధ్య ముగిసిన అంత్యక్రియలు

తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్‌ (K. Viswanath) కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తిపేరు కాశీనాధుని విశ్వనాథ్‌.(K. Viswanath passed away) గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు గ్రామం ఆయన స్వస్థలం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. (RIp K. Viswanath)...

3:40 PM: అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో అభిమానులు

సంప్రదాయాల ప్రకారం కే. విశ్వనాథ్‌ (K. Viswanath) అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట (Panjagutta) శ్మశానవాటికలో కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. కడసారిగా విశ్వనాథ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుమందు ఫిలించాంబర్‌ (Film Chamber)లో విశ్వనాథ్ పార్థీవదేహానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.

Untitled-1.jpg

12:00 PM : సినిమా ఉన్నంత కాలం ఆయన ప్రభావం ఉంటుంది: మహేష్

‘‘సంస్కృతి, సినిమాలను అద్భుతంగా కలగలిపిన జీనియస్ కె. విశ్వనాథ్ గారు. సినిమా ఉన్నంత కాలం ఆయన ప్రభావం ఉంటుంది. విశ్వనాధ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. విశ్వనాథ్ కుటుంబానికి, ఆయనను ప్రేమించేవారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు్న్నా’’ అని సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్కొన్నారు.

11:10 AM: సమాజానికి చక్కని సందేశం అందించారు: తలసాని శ్రీనివాస యాదవ్‌

‘‘విశ్వనాథ్‌గారు తీసిన చిత్రాల ద్వారా సమాజానికి చక్కని సందేశం అందించారు. ఆయన సినిమాలు చాలా మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. ఇండస్ర్టీలో ఎన్నో జానర్ల సినిమాలొచ్చాయి కానీ.. విశ్వనాథ్‌గారు తీసిన సినిమాలు ప్రత్యేకం. మన సంస్కృతి, సంప్రదాయాలపై ఆయనకు మంచి పట్టుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనది ప్రత్యేక స్థానం. ఆయన లేని లోటు తీరనిది. అంత్యక్రియలు... అధికార లాంఛనాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’

10:35 AM : మాకు కె.విశ్వనాథ్ గారు ఉన్నారని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం: ఎస్‌ఎస్ రాజమౌళి

‘ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే.. మాకు కె.విశ్వనాథ్ గారు ఉన్నారని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. తెలుగు చిత్ర పరిశ్రమ మిమ్మల్ని ఎప్పటి మర్చిపోలేదు. సినిమా గ్రామర్‌లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తo రుణపడి ఉంటాం సర్’.

10:15 AM: విశ్వనాథ్ కళాసేవ అజరామరం: కమల్ హాసన్

‘జీవిత పరమార్థాన్ని, కళ సజీవమైనదని పూర్తి అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు. ఆయన చేసిన కళాసేవ ఎప్పటికీ అజరామరం. ఆయన తదనంతరం కూడా అది బతికే ఉంటుంది’

10:15 AM: నా దృక్పథాన్ని శంకరాభరణం మార్చేసింది: పవన్ కల్యాణ్

కళాతపస్వీ స్వర్గస్తులైనందుకు మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నాకు సినిమాలంటే తెలియని సమయంలో.. పాశ్చాత్య పాటలను ఇష్టపడే నాకు మన శాస్త్రీయ సంగీత పెరిగేలా చేశారు. యాక్షన్ సినిమాలంటే ఇష్టపడే నా దృక్పథాన్ని శంకరాభరణం మార్చేసింది.

Untitled-4.jpg

10:02 AM: ఆయన మరణం కూడా ముగింపు కాదు: త్రివిక్రమ్ శ్రీనివాస్

‘విశ్వనాథ్ గారు ప్రతి సినిమా చివరిలో కళా కొనసాగుతూనే ఉంటుందంటారు. అలాగే ఆయన మరణం కూడా ముగింపు కాదు. ఆయన తాలుకు కళా వారసత్వానికి కొనసాగింపని అనుకుంటున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’

09:55 AM: హీరో నానీ స్పందన..

‘బాక్సాఫీస్ కంటే సినిమా ఎక్కువ.

తారలకంటే సినిమా ఎక్కువ.

వ్యక్తుల కంటే సినిమా ఎక్కువ.

ఇది నేర్పింది ఎవరో తెలుసా?

గ్రెటేస్ట్ కె. విశ్వనాథ్ గారు.

మీ రుణం.. వీడుకోలు’

09:40 AM: క్రిష్ రియాక్షన్

‘లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతి నన్ను తీవ్రంగా కలిచి వేసింది. సినిమాపై ఆయనకున్న ప్యాషన్‌, కథను చెప్పే విధానం, పని పట్ల నిబద్ధత నాలాంటి ఎంతోమంది సినీ దర్శకులకు స్ఫూర్తి’.

09:29 AM: చిరంజీవి భావోద్వేగం.. ఒక్క ట్వీట్‌తో అనుబంధం..

దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ (K Viswanath Passed away) కన్నుమూతపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భావోద్వేగంగా స్పందించారు. ట్విటర్ వేదికగా స్పందించారు. వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురుశిష్యుల సంబంధమని, అంతకుమించి తండ్రీ కొడుకుల అనుబంధమంటూ ఒక్క మాట ద్వారా ఇద్దరి అనుబంధాన్ని వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్భాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం దక్కిందని గుర్తుచేసుకున్నారు. ‘‘ ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు కళాతపస్వి కే.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగుజాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్లిన మహా దర్శకుడు ఆయన.

ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్భాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురుశిష్యుల సంబంధం. అంతకుమించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిచిన సమయం నాకు అత్యంత విలువైనది. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావిదర్శకులకి ఒక గైడ్ లాంటివి. 43 సంవత్సరాల క్రితం ఆ మహానీయుడి ఐకానిక్ చిత్ర ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు.

ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి, తెలుగువారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను.’’

దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారకరం: బాలకృష్ణ

కళాతపస్వి కె విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలన పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వకారణం. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమకే వన్నె తెచ్చి.. ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారానికి గురి చేసింది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.

4.jpg

పాట కొంత రాసి.. కొడుకు చేతికి అందించి..

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్‌ కన్ను మూశారు. అయితే ఆయన మరణం చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు. మరణానికి కొన్ని క్షణాల ముందు పాట రాస్తూ.. ఇక రాయలేక దానిని కుమారుడి చేతికందించి కె విశ్వనాథ్ కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచారు.

6.jpg

దర్శకుడు అంటే దార్శనికుడు! విడుదలయ్యాక ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే స్రష్ట.. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట!! ఆ విద్యలో కె.విశ్వనాథ్‌ ఎవరెస్ట్‌. ఒకటి, రెండు అని చెప్పుకోవడం ఎందుకు.. ఆయన సినిమాలన్నీ ఆణిముత్యాలే. వాటిలోనూ.. చరిత్రలో నిలిచిపోయే మేలిముత్యాల్లాంటి సీన్లు ఎన్నో ఎన్నెన్నో!! ఏరుకోగలిగినవారికి ఏరుకున్నంత!!

కళాతపస్వి రూపొందించిన కొన్ని ఎవర్ గ్రీన్ సన్నివేశాలు..

8.jpg

అది.. పోయేవాడు పాడేదేనండీ..!

శంకరాభరణం సినిమాలో చివరి పాట. సోమయాజులు చనిపోయే సీన్‌లో వచ్చే పాట అది. ఆ సీన్‌ గురించి వివరించి, వేటూరి సుందరరామ్మూర్తిని పాట రాయాల్సిందిగా కె.విశ్వనాథ్‌ చెప్పారు. సినిమాకు ప్రాణం లాంటి ఆ అద్భుత సీన్‌ అత్యద్భుతంగా వివరించడంతో.. వేటూరి అంతకంటే బ్రహ్మాండంగా పాటను రాశారు. దొరకునా ఇటువంటి సేవ అంటూ త్యాగరాజ కృతి మొదటి లైన్‌తో సాగే ఆ పాటలో రెండో లైను.. ‘నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ’.. అని వేటూరి రాశారు. అది చూసిన ఆత్రేయ.. ‘అంత పొడవున రాశారు. దాన్ని పాడేవాడు చచ్చిపోతాడు’ అని అంటే.. వేటూరి స్పందిస్తూ.. సినిమాలో ఈ పాట ‘పోయేవాడు పాడే పాటేనండి’ అని సందర్భోచితంగా బదులిచ్చారు. అనంతరం ఆ పాట పాడిన బాలు.. ‘మీరేమో పాడేవాడు పోతాడన్నారు. ఆయనేమో అది పోయేవాడు పాడే పాటేనన్నారు. చివరికి ఆ పాట పాడిన నాకు ప్రాణం పోయినంత పనైంది’ అని సరదాగా అన్నారు.

10.jpg

ఆలిండియా డాన్స్‌ ఫెస్టివల్స్‌ ఇన్విటేషన్‌లో తన పేరు చూసి బాలు (కమల్‌హాసన్‌) భావోద్వేగానికి గురయ్యే సీన్‌

ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులు పాల్గొనే ఆ పోటీల్లో.. ప్రధాని స్థాయి వ్యక్తులు కూడా ప్రేక్షకులుగా హాజరయ్యే ఆ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వాలంటే అదృష్టం ఉండాలంటాడు కమల్‌. తనకు గతంలో ఒకసారి ఆ ప్రదర్శన చూసేందుకు ఇన్విటేషన్‌ వచ్చినా.. డబ్బుల్లేక వెళ్లలేకపోయినట్టు చెబుతాడు. అప్పుడు.. ఈసారి ఫెస్టివల్‌కి తన దగ్గర ఇన్విటేషన్‌ ఉన్నట్టు చెబుతుంది జయప్రద. ఆమె దగ్గర ఉన్న ఇన్విటేషన్‌ తీసుకుని.. ఒక్కొక్క పేజీ తిప్పుతూ.. ‘ఈసారి అందరూ పెద్దవాళ్లేనండీ’ అంటూ వారిని కీర్తిస్తుంటాడు కమల్‌. ఆ ఆహ్వాన పత్రిక చివరిపేజీలో ‘క్లాసికల్‌ డాన్సర్‌’గా తన పేరు చూసి.. ఆనందంతో, ఆశ్చర్యంతో, దుఃఖంతో.. కమల్‌హాసన్‌ గుండె గొంతులోకి వస్తుంది! వెంటనే జయప్రద చేతిని పట్టుకుని.. ఏడవటం ప్రారంభిస్తాడు. ఏమిటి చిన్నపిల్లాడిలాగా.. అంటూ జయప్రద ఊరడిస్తుంటుంది. ఈ సీన్‌లో కెమెరా రన్‌ అవుతుండగానే విశ్వనాథ్‌కు ఒక ఆలోచన వచ్చింది. అప్పటికే అద్భుతంగా నటిస్తున్న కమల్‌హాసన్‌ను ఉద్దేశించి.. ఏడుపులో ఆనందాన్ని కూడా మిళితం చేయాల్సిందిగా సూచించారు. ఆయన సూచన విన్న కమల్‌హాసన్‌.. తల కూడా తిప్పకుండానే ఆయన మనసులో మాటను అర్థం చేసుకుని తన ఏడుపును నవ్వుగా మారుస్తూ నవ్వుతూ.. నవ్వుతూనే ఏడుస్తూ.. సీన్‌ను ఎవరూ ఊహించనంత గొప్పగా పండించారు! అందుకే.. తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయే అద్భుత సన్నివేశాల్లో అది ఒకటిగా నిలిచిపోయింది. కమల్‌హాసన్‌కు కూడా నటుడుగా ఎప్పటికీ గర్వంగా చెప్పుకొనే సన్నివేశంగా మిగిలిపోయింది.

9.jpg

క్లైమాక్స్‌లో నటరాజపాదాల తలవాల్చనా అంటూ శైలజ నర్తిస్తుండగా కమల్‌హాసన్‌ మరణించే సీన్‌.

తన నాట్యాన్ని విమర్శిస్తూ వ్యాసం రాసిన కమల్‌హాసన్‌నే తన గురువుగా పెట్టాలన్న తల్లి జయప్రదపై కోపం పెంచుకుంటుంది శైలజ. కానీ, క్రమంగా వారిద్దరి మధ్య ఉన్న అమలిన బంఽధం గురించి తెలుసుకుని పశ్చాత్తాపపడుతుంది. కథ క్లైమాక్స్‌కు చేరుతుంది. కమల్‌ను గురువుగా భావించి.. ‘ఆచార్య దేవోభవ’ అంటూ పాదాలకు నమస్కరించి.. ‘నటరాజ పాదాన తలవాల్చనా.. నయనాభిషేకాన తరియించనా’ అని పాట పాడుతూ నృత్యం చేస్తుంది! శైలజ దృష్టిలో నటరాజు.. తన గురువైన కమల్‌హాసన్‌. ఆమె నృత్యం చేస్తుండగానే.. కమల్‌ తానెంతగానో అభిమానించే నటరాజు పాదాల చెంతకు వె..ళ్లి..పో..తా..డు. నాట్య ప్రదర్శన జరుగుతుండగానే కన్నుమూసిన తన స్నేహితుణ్ని వీల్‌చెయిర్‌లో అలాగే కూర్చోబెట్టుకుని బయటకు వెళ్లిపోతాడు శరత్‌బాబు! నాట్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆ కళాకారుడి మృతితో.. ఆకాశం రోదిస్తోందా అన్నట్టు వర్షం కురవడం మొదలవుతుంది. వాన కమల్‌ హాసన్‌పై పడకుండా ముందుకు వంగి రెండు చేతులు అడ్డంపెడతాడు శరత్‌ బాబు. వెనగ్గా వచ్చిన జయప్రద.. గొడుగు పడుతుంది! ఒక్క మాట కూడా లేని ఆ సన్నివేశంలో ఉన్న ఆర్ద్రతను వర్ణించడానికి మాటలు సరిపోవు.

14.jpg

‘దొరకునా ఇటువంటి సేవ’ పాట చివరలో సోమయాజులు మరణించే సన్నివేశం

కొడిగడుతున్న శాస్త్రీయ సంగీత ప్రభను తలచుకుని బాధపడే సంగీత కళాకారుడు శంకరశాస్త్రి (సోమయాజులు).. ఓ విధివంచితకు ఆశ్రయమివ్వడంతో సమాజం అనుమానిస్తుంది. దీంతో ఆమె ఆయన్నుంచి దూరంగా వెళ్లిపోయి.. మళ్లీ తన కొడుకుతో తిరిగొచ్చి ఆయన దగ్గర చేరుస్తుంది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంటాడా చిన్నారి! చివర్లో ఆమె ఆయన సంగీత ప్రదర్శనను ఏర్పాటు చేస్తుంది. శుష్కించిపోతున్న సంప్రదాయాన్ని బతికించే ఆ దాతకు నమస్కరిస్తూ.. ‘దొరకునా ఇటువంటి సేవ..’ అంటూ పాడడం మొదలుపెడతాడు సోమయాజులు. దగ్గుతో పాట పాడలేకపోతుంటే ఆ చిన్నారి అందుకుంటాడు. శుష్కించిపోతున్న శాస్త్రీయ సంగీతమనే జీవకళను ఆయన్నంచి ఆ బాలుడు అందిపుచ్చుకున్నట్టు సింబాలిగ్గా చూపిస్తాడు దర్శకుడు! అంతేకాదు.. ఆ అబ్బాయి ‘దొరకునా ఇటువంటి సేవ..’ అని శంకరశాస్త్రిని ఉద్దేశించి పాడుతూ ఆయన పాదాలకు నమస్కారం చేశాక ప్రేమగా ఆలింగనం చేసుకుని నుదుటన ముద్దుపెట్టి.. ఆ చిన్నారి పాదానికి తన గండపెండేరం తీసి తొడుగుతాడు. పిల్లవాడి ముఖాన్ని రెండు చేతులతో ఆర్ద్రంగా తడుముతూ.. ఆనందాశ్రువులు రాలుస్తూ.. కన్నుమూస్తాడు!

11.jpg

Updated Date - 2023-02-03T15:59:34+05:30 IST