Kadiam Srihari: గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదుగా..: కడియం
ABN , Publish Date - Dec 15 , 2023 | 01:00 PM
గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధికి ఎంచుకున్నమార్గం ఏమిటో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుగా ఉందన్నారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని విస్మరించారని, తిరోగమన దిశలో తెలంగాణ ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారని కడియం అన్నారు. నీతి ఆయోగ్ ప్రశంసలు, కేంద్ర ప్రభుత్వ అవార్డులను విస్మరించారని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్, ఐటీ ఎగుమతుల్లో సాధించిన ప్రగతిని గవర్నర్ చెప్పడం మరచిపోయారని ఆయన అన్నారు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయింది అని గవర్నర్ చెప్పడం సరికాదన్నారు. ఆమె స్థాయికి తగదన్నారు. గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరమని కడియం అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారని, 2014 లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తం అయ్యిందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదని, దళిత బంధు ప్రస్తావన లేదని, రైతుల పంటలకు బోనస్ గురించి మాట్లాడ లేదన్నారు. కాంగ్రెస్ హామీల నుంచి పలాయన వాదం పాటించేలా గవర్నర్ ప్రసంగం ఉందని ఆయన అన్నారు.