Jeevan Reddy: దళిత బంధుపై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-28T13:46:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jeevan Reddy: దళిత బంధుపై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దళిత బంధు అత్యంత అవినీతిమయం అయ్యిందని ఆరోపించారు. అవినీతి చేసిన ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఏసీబీ (ACB) పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధులపై చర్యలేవీ అంటూ నిలదీశారు. రాజయ్యపై ఆరోపణ వస్తేనే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. దళిత జాతిని కేసీఆర్ (CM KCR) అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి చేస్తే అడ్డంగా నరకుతా అన్న కేసీఆర్‌కు ఎవరు అడ్డొస్తున్నారని అడిగారు. ఎమ్మెల్యేల తాట తీయడానికి కేసీఆర్‌కు భయమెందుకు అని ప్రశ్నించారు. దళిత బంధు అవినీతికి కేసీఆర్ దే బాధ్యత అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

అలాగే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ‌పై స్పందిస్తూ.. ఉద్యోగాలు ఇవ్వొద్దన్న కుట్రలో భాగంగానే పేపర్ లీకేజీ అని ఆరోపించారు. ఉద్యోగాలు ఇస్తే.. జీతాలు ఇవ్వాలన్నారు. అయితే ప్రభుత్వం దగ్గర జీతాలకు కూడా పైసలు లేవని తెలిపారు. అందుకే ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆలస్యం చేస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2023-04-28T14:16:39+05:30 IST