Maoist: కీలక మావోయిస్ట్ అరెస్ట్

ABN , First Publish Date - 2023-04-21T21:14:57+05:30 IST

మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యునితో పాటు ఒక సానుబూతి పరుడిని వరంగల్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

Maoist: కీలక మావోయిస్ట్ అరెస్ట్

వరంగల్: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యునితో పాటు ఒక సానుబూతి పరుడిని వరంగల్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇద్దరి నుంచి రూ. 21 వేల నగదుతో పాటు విప్లవ సాహిత్యం, ఒక పెన్‌డ్రైవ్‌, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బబ్చేరు చెలుక గ్రామానికి చెందిన మూల దేవేందర్‌రెడ్డి ఆలియాస్‌ మాధవ్‌ ఆలియాస్‌ కరప ఆలియాస్‌ నందు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ సభ్యుని హోదాలో సెంట్రల్‌ టెక్నికల్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. దేవేందర్‌రెడ్డి స్వగ్రామంలో 7వ తరగతి వరకు చదువుకుని 1978లో అప్పటి పీపుల్స్‌వార్‌ ఆర్గనైజర్‌ పోరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రోత్సాహంతో పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితుడై సానుబూతి పరునిగా పనిచేశాడు. ఈ తర్వాత 1982లో సిర్‌పూర్‌ దళసభ్యుడిగా పని చేశాడు. మూడేళ్ల పాటు సిర్‌పూర్‌ దళకమాండర్‌గా పని చేసి చాలా విధ్వంసాలకు పాల్పడ్డాడు. 1985లో అప్పటి డీసీఎం కటకం సుదర్శన్‌ ఆలియాస్‌ ఆదేశాలతో అహేరి దళానికి బదిలీ అయ్యాడు.

1987లో దళసభ్యురాలు ఆత్రం బయ్యక్క ఆలియాస్‌ జ్యోతిని పార్టీలో వివాహం చేసుకున్నాడు. దేవేందర్‌రెడ్డికి సెంట్రల్‌ టెక్నికల్‌ కమిటీ సభ్యుడు రమణతో పరిచయం ఏర్పడింది. ఆయన సహాకారంతో పార్టీలో టెక్నికల్‌ కమిటీ విభాగంలో పని చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీకి 850 తుపాకులు తయారు చేసి అందించాడు. 2007లో దేవేందర్‌రెడ్డితో పాటు ఆయన భార్య తయారు చేసిన తుపాకులు తీసుకుని చర్ల మీదుగా దండకారణ్యంకు తీసుకెళుతుండగా 2009లో పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత దేవేందర్‌రెడ్డి తన భార్యతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. దేవేందర్‌రెడ్డి ప్రస్తుతం సెంట్రల్‌ కమిటీ టెక్నికల్‌ సభ్యుడిగా పని చేస్తున్నాడు. హనుమకొండ జిల్లా వికాస్‌నగర్‌కు చెందిన గుర్రం తిరుపతిరెడ్డి ఒక పక్క రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ మావోయిస్టు పార్టీకి సానుబూతి పరుడిగా పని చేస్తున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-04-21T21:14:57+05:30 IST