Batti Vikramarka: కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ యత్నించింది.. అయినప్పటికీ..

ABN , First Publish Date - 2023-07-04T14:10:19+05:30 IST

తెలంగాణ జన గర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జన గర్జన సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలన్న సంకల్పంతో ప్రజలు ప్రభుత్వ అడ్డంకులు తొలగించుకొని మరీ సభకు వచ్చారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దోపిడీని ఆపడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినట్లు తెలిపారు.

Batti Vikramarka: కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ యత్నించింది.. అయినప్పటికీ..

ఖమ్మం: తెలంగాణ జన గర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) అనేక ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Batti Vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ జన గర్జన సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలన్న సంకల్పంతో ప్రజలు ప్రభుత్వ అడ్డంకులు తొలగించుకొని మరీ సభకు వచ్చారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దోపిడీని ఆపడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా అంటే అనేక భావజాలాలకి పుట్టినిల్లు అని.. అసమానతలు తొలగించడం కోసం అనాదిగా పోరాటం చేసిన గడ్డ అని చెప్పుకొచ్చారు. మన జిల్లా పూర్వ నాయకుల తపన విజ్ఞానం తనకు పాదయాత్రలో ఉపయోగపడ్డాయన్నారు. ఆనాటి గడీల సంస్కృతినే కేసీఆర్ (CM KCR) చేస్తున్నారని విమర్శించారు. పునర్నిర్మాణం అంటే ఆనాటి గడీలకు రంగులు వేయించడమా అని ఆయన ప్రశ్నించారు.

గోదావరి కృష్ణా జలాలు తెలంగాణకు రావాలన్నారు. తొమ్మిదిన్నర ఎండ్లలో ఒక్క ఎకరానికి కూడా గోదావరి కృష్ణా జలాలు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వకుండా రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెపుతున్నారని.. రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ప్రాణహిత చేవెళ్ల ద్వారా నీళ్లు వచ్చేవని చెప్పుకొచ్చారు. శబరి గోదావరి దగ్గర కట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు పారేవన్నారు. దాన్ని ఆపి ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ అంటున్నారన్నారు. నీళ్లు నిధులు నియామకాలు గురించి పూర్తి వివరాలతో మళ్ళీ చర్చ పెడతానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీం అని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని.. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్టే అని అన్నారు. రాష్ట్రంలో జన గర్జన లాంటి సభలు ఇంకా ఉంటాయన్నారు. మంత్రి హరీష్ రావు బడాయి మాటలు మాట్లాడటం ఎక్కువైందని మండిపడ్డారు. రెండు సార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటే సీటు గెలిచారని.. ఈ సారి పదికి పది సీట్లు కాంగ్రెస్ గెలుస్తామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-04T14:10:19+05:30 IST