Komatireddy Venkat Reddy: గాంధీభవన్‌కు కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2023-01-20T18:46:45+05:30 IST

గాంధీభవన్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) వచ్చారు. కొంతకాలంగా ఆయన గాంధీభవన్‌కు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ ఠాక్రే..

Komatireddy Venkat Reddy: గాంధీభవన్‌కు కోమటిరెడ్డి

హైదరాబాద్: గాంధీభవన్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) వచ్చారు. కొంతకాలంగా ఆయన గాంధీభవన్‌కు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ ఠాక్రే (Thackeray)తో కోమటిరెడ్డి భేటీ కానున్నారు. గాంధీభవన్ మెట్లు ఎక్కబోనని తానెప్పుడూ అనలేదని, మీటింగ్‌కు రావాలని ఠాక్రే ఆహ్వానించారని తెలిపారు. ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో పాల్గొనడానికి వచ్చానని పేర్కొన్నారు. తాను ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని వెంకటరెడ్డి తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy)కి మద్దతు ఇవ్వాలంటూ ఓ కాంగ్రెస్‌ నాయకుడికి వెంకట్‌రెడ్డి ఫోన్‌ చేసిన ఆడియో అప్పట్లో బయటికి వచ్చింది. తన సోదరుడి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరోక్షంగా సహకరించారని, కాంగ్రెస్ (Congress) అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని పట్టించుకోలేదని, హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి.

మునుగోడు ఫలితాల్లో స్రవంతికి డిపాజిట్లు కూడా దక్కలేదు. వెంకట్‌రెడ్డి పరోక్షంగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకునేందుకే స్రవంతికి అనుకూలంగా ప్రచారం చేయలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే కారణంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంకట్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని వెంకట్‌రెడ్డి చెబుతున్నారు. తమ్ముడి తరహాలోనే వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే దీన్ని ఆయన ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతున్నారు. మునుగోడు ఎన్నికల్లో తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ ఓ కాంగ్రెస్‌ నాయకుడికి వెంకట్‌రెడ్డి ఫోన్‌ చేసిన ఆడియో బయటికి వచ్చిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌.. అధిష్ఠానానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక మేరకు ఏఐసీసీ క్రమశిక్షణ ఉల్లంఘన కమిటీ మెంబర్‌ సెక్రటరీ తారిఖ్‌ అన్వర్‌ షోకాజ్ నోటీస్‌ (Showcase Notices) జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-20T18:46:46+05:30 IST