Share News

MIM: జూబ్లీహిల్స్‌పై ఎంఐఎం గురి.. రేపోమాపో నియోజకవర్గానికి అక్బరుద్దీన్‌

ABN , First Publish Date - 2023-11-23T12:52:23+05:30 IST

జూబ్లీహిల్స్‌(Jubilee Hills) ఈ పేరు వినగానే ధనవంతులే గుర్తుకు వస్తారు. కానీ ఈ నియోజకవర్గంలో పేద,

MIM: జూబ్లీహిల్స్‌పై ఎంఐఎం గురి.. రేపోమాపో నియోజకవర్గానికి అక్బరుద్దీన్‌

- మొదటిసారిగా దృష్టి సారించిన అధిష్ఠానం

- పలుమార్లు అసదుద్దీన్‌ పాదయాత్ర

- మైనారిటీ ఓటు బ్యాంకుపైనే ఆశలు

పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల వరకే పరిమితమైన ఎంఐఎం ఈసారి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంపై దృష్టి సారించింది. ఎలాగైనా ఇక్కడ పట్టుపెంచుకోవాలని పార్టీ నాయకులు పథకాలు వేస్తున్నారు. ఇక్కడ ఉన్న మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అవసరమైన అన్ని అస్త్రాలనూ ఉపయోగిస్తున్నారు.

బంజారాహిల్స్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌(Jubilee Hills) ఈ పేరు వినగానే ధనవంతులే గుర్తుకు వస్తారు. కానీ ఈ నియోజకవర్గంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఉండే కాలనీలు, బస్తీలే అధికం. నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్‌లో పాగా వేయాలనేది అన్ని రాజకీయ పార్టీల ఆరాటం. ఇందుకోసం ఎవరికి వారు తమదైన శైలిలో ఓటు బ్యాంకు కొల్లగొట్టేందుకు పథకాలు వేస్తూనే ఉన్నారు. అభ్యర్థులు ప్రచారాలతో దూసుకుపోతోంటే పార్టీ సీనియర్‌ నేతలు మాత్రం చాపకింద నీరులా వ్యవహారాలను తమకు అనుకూలంగా మార్పుకునేందుకు యత్నిస్తున్నారు.

2009లోనే జూబ్లీహిల్స్‌లో అభ్యర్థిని నిలపాలని ఎంఐఎం పార్టీ భావించింది. కానీ సాధ్యం కాలేదు. చివరకు 2014 ఎన్నికల్లో ఎంఐఎం మొదటి సారి పోటీ చేసింది. ఓటమి పాలవ్వడంతో 2018లో ఆసక్తి కనబర్చలేదు. గ్రేటర్‌ ఎన్నికల్లో రెండు సీట్లను గెలుచుకోవడంతో మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు మైనారిటీ అభ్యర్థిని రంగంలోకి దించింది.

మైనారిటీల ఓట్లు అధికంగా ఉండటమే కారణం

జూబ్లీహిల్స్‌లో 3.78 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.10 లక్షల మంది మైనారిటీ ఓటర్లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఎలాంటి ఎన్నికలు జరిగినా వీరే ప్రభావం చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా రహ్మత్‌నగర్‌, బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేట డివిజన్‌లో మైనారిటీ ఓటర్లే కీలకంగా మారారు. ఈ తరుణంలో వీరి అండతో జూబ్లీహిల్స్‌లో పాగా వేయాలని ఎంఐఎం భావిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న ఏడు డివిజన్‌లలో రెండింట ఎంఐఎం గెలిచింది. మిగతా చోట్ల కూడా పార్టీ అభ్యర్థి విజేతలను ముప్పు తిప్పలు పెట్టారు. ఈ క్రమంలో విజయం ఎలాగున్నా ఇప్పటి నుంచే ఓటు బ్యాంకు రక్షించుకుంటే భవిష్యత్‌లో పట్టు సాధించవచ్చని సీనియర్‌లు అభిప్రాయపడుతున్నారు.

షేక్‌పేటలో సిట్టింగ్‌ కార్పొరేటర్‌గా ఉన్న ఫరాజుద్దిన్‌కు అసెంబ్లీ టికెట్‌ కేటాయించారు. ఫరాజుద్దిన్‌కు షేక్‌పేటలో మంచి పట్టు ఉంది. ఈసారి డివిజన్‌లో ఉన్న 60 శాతం మైనారిటీలు తనకే ఓటు వేస్తారని ఫరాజుద్దీన్‌ అధిష్ఠానంకు చెప్పారు. ఎలాగూ ఎర్రగడ్డలో ఎంఐఎం కార్పొరేటరే ఉన్నారు. ఎర్రగడ్డలో మొదటి నుంచి పట్టుఉన్న మహ్మద్‌షరీఫ్‌ ఇటీవలె మరణించారు. ఈ సానుభూతి కూడా అనుకూలిస్తుందని పార్టీ భావిస్తోంది. మైనారిటీ ఓట్లతోపాటు ఇతర మతాల ఓట్లలో కొంత భాగమైనా తీసుకుంటే విజయం సాధ్యం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ee.jpg

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ తో గండం

మైనారిటీ ఓట్లపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కూడా ఆశలు పెట్టుకుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో సుమారు 22 వేల మంది లబ్ధిపొందారు. లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులకు తమకు ఓటు వేసి బలపరుస్తారని బీఆర్‌ఎస్‌ ఆశలు పెట్టుకుంది. మైనారిటీలు కీలకంగా ఉన్న రహ్మత్‌నగర్‌, బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేటలో పార్టీని పట్టిష్ఠం చేసుకుంది. కాలనీల్లో కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక కాంగ్రెస్‌ కూడా మైనారిటీ ఓట్లను కొల్లగొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మాజీ క్రికెటర్‌ అజారుద్దిన్‌ను రంగంలోకి దించింది. మైనారిటీలతో పాటు మిగతా వర్గాల ఓట్లపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. అయితే మూడు పార్టీల్లో మైనారిటీలు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో.. డిసెంబర్‌ 3వరకు వేచిచూడాల్సిందే మరి..

అసదుద్దీన్‌ పర్యటన

పాతబస్తీలో ఎంఐఎంకు ఇప్పటికి తిరుగులేని ఆదిపత్యం ఉంది. అసదుద్దిన్‌, అక్బరుద్దీన్‌పై అభిమానంతో పాతబస్తీ ప్రజలు ఓట్లు వేస్తారు. ఇదే చరిష్మాను జూబ్లీహిల్స్‌లో ఉపయోగించాలని పార్టీ భావించింది. ఆలోచన వచ్చిందే ఆలస్యంగా పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ నియోజకవర్గంలో మూడు మార్లు పర్యటించారు. ఎర్రగడ్డ, బోరబండ, షేక్‌పేటలో పాదయాత్రలు నిర్వహించిన మైనారిటీ కుటుంబాలను నేరుగా కలుస్తున్నారు. రోడ్‌ షో జోలికి వెళ్లకుండా నేరుగా ఓటరును కలిసేందుకు ప్రధాన్యత ఇస్తున్నారు. అంతే కాకుండా అక్బరుద్దీన్‌ కూడా నియోజకవర్గంలోసుడిగాలిపర్యటన చేయనున్నారని ఎంఐఎం నాయకులు చెబుతున్నారు.

Updated Date - 2023-11-23T12:54:15+05:30 IST