Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితులపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-06-27T12:45:18+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నేతలపైనే దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపరించిందన్నారు. ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తా అనుకోలేదన్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) నెలకొన్న పరిస్థితులపై ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLa Jaggareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నేతలపైనే దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపరించిందన్నారు. ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తానని అనుకోలేదన్నారు. పార్టీలో నాలుగేళ్ళ నుంచి తనపై ప్రచారం జరుగుతోందని... పార్టీ కోసం ఎంత చేసినా తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో ఎందుకు ఈ పరిస్థితి ఉందో అర్థం కావడం లేదన్నారు. మీడియా అడిగేదాంట్లో తప్పు లేదని తెలిపారు. అగ్రనేత రాహుల్ గాంధీకి (Raghul Gandhi) అన్ని విషయాలు నిశితంగా వివరిస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికల వ్యూహాలపై రాహుల్ గాంధీ పిలిచారన్నారు. ‘‘నేను పైరవికారుణ్ణి కాదు.. వాళ్ళు పిలిస్తేనా వచ్చా. పార్టీ ఐక్యంగా ఉందో లేదో నేను చెప్పలేను... నేను చెప్పే వాడిని కూడా కాదు.. పార్టీ ఐక్యంగా ఉందో లేదో రాహుల్ గాంధీకి చెబుతా’’ అంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. కాగా.. తెలంగాణలో పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితులపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పార్టీ పెద్దలు రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఈరోజు (మంగళవారం) చర్చలు జరుపనున్నారు. ఏఐసీసీ వార్ రూమ్‌లో టీ కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ జరుగనుంది. సమావేశానికి 21 మంది తెలంగాణ నేతలకు పిలుపు రావడంతో వారంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy), ఉత్తమ్ (Uttam kumar Reddy), మధు యాష్కీ (Madhu Yashki), వీహెచ్ (VH), జగ్గారెడ్డి (Jagga reddy), సీతక్క(Seethakka), జీవన్ రెడ్డి (Jeevan Reddy), శ్రీధర్ బాబు (Sridhar Babu) తదితర నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ స్ట్రాటజీపై చర్చ జరుగనుంది. పార్టీలో అంతర్గత కలహాలపై, కోవర్టుల ఆరోపణలపై నేతలు ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఘర్ వాపసీ, అపరేషన్ ఆకర్ష్, చేరికల అంశంపై కూడా సమావేశంలో చర్చ జరుగనుంది. కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నినాదాన్ని ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై మంతనాలు జరుపనున్నారు. రాహుల్, ప్రియాంక (Priyanka Gandhi), ఖర్గే రాష్ట్ర పర్యటనల షెడ్యూల్‌ను నేతలు ఖరారు చేసే అవకాశం ఉంది.