Yadagirigutta: లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2023-04-23T10:56:45+05:30 IST

Yadadri: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు.

Yadagirigutta: లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

Yadadri: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. శ్రీ స్వామి వారి విష్ణు పుష్కరణిలో స్నానమాచరించి స్వామివారి మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు సమయం పడుతోంది. భక్తులు క్యూ లైన్‌లలో వేచి ఉన్నారు.

కాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం విశేష వేడుకలకు సన్నద్ధమవుతోంది. రానున్న 25 రోజుల్లో మూడు విశేష పర్వాలకు యాదగిరికొండ వేదిక కానుంది. ఈ నెల 25న శ్రీమద్భవగవద్రామానుజాచార్యుల జయంతి, మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నృసింహ జయంత్యుత్సవాలు, మే 14వ తేదీన హనుమజ్జయంతి వేడుకలు కొనసాగనున్నాయి. యాదగిరిక్షేత్రంతో పాటు అనుబంధ పాతగుట్ట ఆలయాల్లోనూ ఈ వేడుకలు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ వైశేషిక వేడుకలకు దేవస్థాన అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.

ప్రధానాలయ ఉద్ఘాటనలో భాగంగా ముఖమండపంలో భగవద్రామానుజుల విగ్రహాన్ని నమ్మాళ్వార్లు కొలువుదీరిన ఉపాలయంలో ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. సమతామూర్తిగా ప్రసిద్ధిగాంచిన భగవద్రామానుజుల జయంతి వేడుకలకు ఈ నెల 23న శ్రీకారం చుట్టగా, ఈ నెల 25న సంప్రదాయ రీతిలో జయంతి పర్వాలను నిర్వహిస్తారు. వచ్చే నెలలో నృసింహ జయంతి, హనుమజ్జయంతితో పాటు మే 1న ఏకాదశి లక్షపుష్పార్చనలు, మే 5న స్వాతి నక్షత్రోత్సవ వైదిక ఘట్టాలను సంప్రదాయరీతిలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 2న ఉదయం విశ్వక్సేనుడికి తొలి పూజలతో స్వస్తిపుణ్యాహవాచనంతో వేడుకలకు శ్రీకారం చుడతారు. అదే రోజు ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం మృత్స్యంగ్రహణం, అంకురారోహణం పర్వాలు నిర్వహిస్తారు. 4వ తేదీన నృసింహావిర్భావ వేడుకతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ నృసింహ జయంత్యుత్సవాలు సంప్రదాయరీతిలో నిర్వహిస్తారు.

Updated Date - 2023-04-23T10:56:45+05:30 IST