Naveen case: నవీన్ హత్య కేసులో కొత్త నిజాలు వెలుగులోకి.. హరిహరకృష్ణ అసలు ఏమేం చేశాడంటే..
ABN , First Publish Date - 2023-02-27T17:40:41+05:30 IST
తెలుగు రాష్టాల్లో నవీన్ (Naveen) హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నవీన్ హత్య రిమాండ్ రిపోర్ట్
హైదరాబాద్: తెలుగు రాష్టాల్లో సంచలనం సృష్టించిన నవీన్ (Naveen) హత్య కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి (ABN Andhra Jyothy) లభ్యమైన రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రేమకు అడ్డువస్తున్నాడనే నవీన్‌ను హరిహరకృష్ణ (Harihara Krishna) హత్య చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. మూడునెలల ముందే నవీన్ హత్యకు ప్రణాళిక రచించాడని, 2 నెలల క్రితమే మలక్పేట సూపర్ మార్కెట్లో నిందితుడు హరిహరకృష్ణ కత్తి కొనుగోలు చేసినట్లు రిపోర్టులో తెలిపారు. ఈనెల 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసినట్లు వెల్లడించారు.
‘‘హత్యకు ముందు పెద్దఅంబర్పేట్ వైన్స్ షాపులో నవీన్, హరిహరకృష్ణ మద్యం తాగారు. యువతి విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఓఆర్ఆర్ దగ్గర నిర్మానుష్య ప్రాంతానికి ఇద్దరూ చేరుకున్నారు. నవీన్ గొంతు నులిమి హరిహరకృష్ణ హత్యచేశాడు. తర్వాత కత్తితో నవీన్ శరీరాన్ని ముక్కలుగా చేశాడు. తల, వేళ్లు, ఇతర శరీర విడిభాగాలను బ్యాగులో వేసుకొని పరారయ్యాడు. బ్రాహ్మణపల్లి నిర్మానుష్య ప్రదేశంలో శరీర భాగాలను నిందితుడు పడేశాడు. పక్కనే ఉన్న ఫ్రెండ్ హసన్ ఇంటికి హరిహరకృష్ణ వెళ్లాడు. అక్కడ స్నానం చేసి.. హత్య విషయం స్నేహితుడికి హరి చెప్పాడు. మరుసటి రోజు ప్రియురాలికి కూడా నిందితుడు హత్య విషయం చెప్పాడు. ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం మీదుగా విశాఖపట్నంకు పరారయ్యాడు. 24న తిరిగి హైదరాబాద్కు చేరుకొని హత్యాస్థలంలో నవీన్ శరీర విడిబాగాలు సేకరించి హరిహరకృష్ణ దహనం చేశాడు. ఈనెల 24న సాయంత్రం పోలీసులకు హరిహరకృష్ణ లొంగిపోయాడు’’ అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.