TS News: డబ్బులు ఇవ్వలేదని చనిపోయిన తల్లి పట్ల బిడ్డల నిర్వాకం... చూస్తే కన్నీళ్లాగవు
ABN , First Publish Date - 2023-05-07T14:46:19+05:30 IST
మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది అనడానికి జిల్లాలో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలిచింది.
కామారెడ్డి: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది అనడానికి జిల్లాలో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలిచింది. డబ్బుకు మాత్రమే విలువ ఇస్తూ బంధాలను, బాంధవ్యాలను మరిచిపోతున్న పరిస్థితి. వృద్ధ తల్లిదండ్రుల పట్ల కొందరు బిడ్డలు అమానుశంగా ప్రవర్తిస్తున్నారు. బతికున్నప్పుడే కాకుండా చనిపోయినప్పుడు కూడా వారి పట్ల నిర్ధయగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. డబ్బులు ఇవ్వని కారణంగా మృతి చెందిన కన్న తల్లి పట్ల ఎంతో కర్కశంగా ప్రవర్తించారు ఆ బిడ్డలు. అనారోగ్యంతో బాధపడుతున్న కిష్టవ్వ (70) అనే వృద్ధురాలిని కుటుంబసభ్యులు గత నెల 21న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ కిష్టవ్వ నిన్న రాత్రి కన్నుమూసింది. అయితే చనిపోయిన మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వృద్ధురాలిపై కుటుంబసభ్యులు దాడి చేసినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలు కిష్టవ్వ తన పేరిట బ్యాంకులో ఉన్న అమౌంట్‌ను కూతుళ్లకు, కొడుకులకు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో తల్లి చనిపోయిన విషయం తెలిసిన బిడ్డలు.. కోపంతో ఆమె శవాన్ని ఆస్పత్రి వద్దే వదిలేసి వెళ్లిపోయారు. శవాన్ని తీసుకువెళ్లాల్సిందిగా కుటుంబసభ్యులకు ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ శవాన్ని తీసుకెళ్లడానికి నిన్నటి నుంచి రాకుండా కుటుంబసభ్యులు నిరాకరిస్తున్న పరిస్థితి.