ORR Tenders: ఓఆర్ఆర్ టెండర్లను వెంటనే రద్దు చేయాలి: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-05-04T16:53:18+05:30 IST

ఓఆర్ఆర్ టెండర్ల (ORR Tenders)ను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు...

ORR Tenders: ఓఆర్ఆర్ టెండర్లను వెంటనే రద్దు చేయాలి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: ఓఆర్ఆర్ టెండర్ల (ORR Tenders)ను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్ వివాదంపై సంబంధిత మంత్రి సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. సమాధానం ఇవ్వలేక మంత్రి కేటీఆర్ (KTR) మొహం చాటేశారని దుయ్యబట్టారు. ఔటర్ వివాదంపై మంత్రి కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని రేవంత్ ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టెండర్లలో రూ.వేల కోట్ల దోపిడీ జరిగిందని, కేటీఆర్ సమాధానం చెప్పలేక.. అధికారులతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. రూ.70 వేల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డు.. రూ.7 వేల కోట్లకే 30 ఏళ్లకు ఎలా రాసిస్తారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆస్తులను ఎలా తాకట్టు పెడతారని అని నిలదీశారు. ఔటర్ రింగ్‌ రోడ్డుపై ఇప్పుడు ఒక్క రూపాయి కూడా రుణ భారం లేదని, కేంద్రం మార్గంలోనే తెలంగాణ సర్కార్ (Telangana Govt) ప్రభుత్వ సంస్థలను అమ్ముతోందని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

అధికారిక పక్షం, ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వం

‘‘అధికారిక పక్షం, ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వం. టెండర్ల వివరాలు అందరికీ తెలపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వివరాలు చెప్పకుండా రహస్యంగా ఉంచితే జైలుకు వెళ్లాల్సివస్తుంది. అర్వింద్కుమార్ (Arvind Kumar) అన్ని వివరాలను రహస్యంగా ఉంచుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడానికి వీలు లేదు. మూడేళ్లు అధికారంలో ఉంటే అర్వింద్ కుమార్.. 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టెండర్లు ఖరారు చేసే హక్కు లేదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేటప్పుడు.. వాటి కనీస మద్దతు ధర చూపించి టెండర్లు పిలవాలి. రూ.లక్ష కోట్లకు సంబంధించిన ఓఆర్ఆర్ టెండర్కు కనీస ధర నిర్ణయించకుండా ఎలా వేలం వేస్తారు?.. ఓఆర్ఆర్ కాంట్రాక్టు ఇస్తే లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. అటువంటప్పుడు ఎవరికో కాంట్రాక్టులు ఇవ్వడం ఎందుకు?.. ఓఆర్ఆర్ చుట్టూ చెట్లు, మొక్కల నిర్వహణకు ఏడాదికి రూ.40 కోట్లు ఖర్చు అవుతుంది. టెండర్లలో పాల్గొనే కంపెనీల పేర్లు చెప్పమంటే ఎందుకు చెప్పడం లేదు?.. రహస్యంగా ఉంచడానికి ఇదేమన్న దేశభద్రతకు సంబంధించిన అంశమా?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2023-05-04T16:53:18+05:30 IST