Yadadri Temple: యాదాద్రి ఆలయానికి నిజాం యువరాణి ఎస్రా విరాళం.. ఎంత ఇచ్చారంటే..
ABN , First Publish Date - 2023-02-27T17:09:11+05:30 IST
తెలంగాణకు మకుటాయమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దివంగత నిజాం ముకర్రం ఝా మాజీ భార్య ప్రిన్సెస్ ఎస్రా..
హైదరాబాద్: తెలంగాణకు మకుటాయమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి (Yadadri Temple) వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దివంగత నిజాం ముకర్రం జా మాజీ భార్య ప్రిన్సెస్ ఎస్రా (Princess Esra) భారీ విరాళం ఇచ్చారు. రూ.5 లక్షలు విలువైన 67 గ్రాముల స్వర్ణాభరణలను (Gold Jewelry) ఆలయానికి బహూకరించారు. యువరాణి ఎస్రా తరఫున యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జి.కృష్ణారావు ఈ స్వర్ణాభరణాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీతకు అందజేశారు.
లండన్‌లో ఉంటున్న యువరాణి ఎస్రా తరచూ హైదరాబాద్‌కు, తన స్వదేశమైన టర్కీకి వెళ్తుంటారని, యాదాద్రిని సందర్శించాలనే కోరికను కూడా గతంలో వెలిబుచ్చారని కృష్ణారావు తెలిపారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనలో (Hyderabad) యాద్రాద్రి ఆలయాన్ని దర్శించాలని ఆమె అనుకున్నప్పటికీ గత నెలలో ముకర్రం జా మరణంతో ఆలయాన్ని సందర్శించలేకపోయారని వెల్లడించారు. అసఫ్ జాహీల పాలనలో హైదరాబాద్ చిట్టచివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కూడా యాదాద్రి ఆలయ అభివృద్ధికి గ్రాంట్‌గా రూ.82,825 మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ప్రిన్స్ ఎస్రా...
టర్కీలో జన్మించిన ఎస్రా వివాహంతో యువరాణి అయ్యారు. 1959లో అసఫ్ జా హయాంలో రాజవంశీయుడైన ప్రిన్స్ ముకర్రం జాను ఆమె వివాహం చేసుకున్నారు. 15 ఏళ్ల వైవాహిక జీవితంలో వారికి షేఖ్య అనే కుమార్తె, అజ్మెత్ జా అనే కుమారుడు కలిగారు. ప్రస్తుతం అసఫ్ జా హౌస్ అధిపతిగా అజ్మెత్ జా ఉన్నారు. లండన్‌లో ఉంటూనే హైదరాబాద్‌లోని చౌమహల్లా, ఫలక్‌నుమా ప్యాలస్‌లను పునరుద్ధణలో ప్రిన్సెస్ ఎస్రా పాలుపంచుకున్నారు.
యాదాద్రి ఆలయం..
తెలంగాణలోని యాదాద్రి భువన గిరి జిల్లా యాదగిరిగుట్ట కొండపై యాద్రాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి కొలువై ఉన్నారు. ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులు 2016లో ప్రారంభమై 2022 మార్చిలో పూర్తయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2022 మార్చి 28న ప్రారంభించారు. గతంలో రెండు ఎకరాల్లో నిర్మితమైన ఈ ఆలయం ప్రస్తుతం 14 ఎకరాలకు విస్తరించి, పూర్తిగా రాతితో నిర్మితమైంది.