Chigurupati Jayaram: చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2023-03-09T16:03:02+05:30 IST

సంచలనం సృష్టించిన పారిశ్రామిక వేత్త, ఎన్‌ఆర్‌ఐ చిగురుపాటి జయరాం (Chigurupati Jayaram) హత్య కేసులో రాకేశ్‌ రెడ్డికి నాంపల్లి మొదటి సెషన్స్‌ కోర్టు..

Chigurupati Jayaram: చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన పారిశ్రామిక వేత్త, ఎన్‌ఆర్‌ఐ చిగురుపాటి జయరాం (Chigurupati Jayaram) హత్య కేసులో రాకేశ్‌ రెడ్డికి నాంపల్లి మొదటి సెషన్స్‌ కోర్టు (Nampally First Sessions Court) జీవిత ఖైదు విధించింది. 2019 జనవరి 31న జయరామ్‌ను రాకేశ్‌ రెడ్డి (Rakesh Reddy) హత్య చేశాడు. ఈ కేసులో రాకేశ్‌ రెడ్డిని A1గా ఉన్నాడు. ఈ నెల 6వ తేదీనే ఈ కేసు విచారణ పూర్తయింది. ఈ కేసులో రాకేశ్‌ రెడ్డిని దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ రోజు నిందితుడికి కోర్టు శిక్ష విధించింది. జయరాం హత్యపై జూబ్లీహిల్స్‌ పోలీసులు 320 పేజీల చార్జిషీట్‌ (Charge sheet)ను కోర్టులో దాఖలు చేశారు. 48 మంది సాక్షులు కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. నాలుగేళ్ల పాటు విచారణ కొనసాగింది. జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)కు చెందిన జయరాం కోస్టల్‌ బ్యాంకు చైర్మన్‌గా, ఎక్స్‌ప్రెస్‌ టీవీ ఎండీగా ఉండేవారు. ఓ ఫార్మా కంపెనీ యజమాని కూడా. ఆ కంపెనీ నష్టాల్లో ఉండడంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి.

2017లో ఆయనకు తన మేనకోడలు శిఖా చౌదరి (Shikha Chaudhary) ద్వారా రాకేశ్‌ రెడ్డి పరిచయమయ్యాడు. జయరాం అతని వద్ద నుంచి రూ.4 కోట్లు అప్పు తీసుకున్నాడు. వడ్డీతో కలిపి రూ.6 కోట్లు చెల్లించాలని రాకేశ్‌ రెడ్డి ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. దీంతో జయరాం అతని ఫోన్‌ తీయడం కూడా మానేశాడు. అమెరికా వెళ్లిపోయి కొంతకాలం తర్వాత వచ్చాడు. ఇది తెలిసిన రాకేశ్‌ రెడ్డి... జయరాంను హనీ ట్రాప్‌ వేసి ఒక చోటుకు రప్పించి కిడ్నాప్‌ చేశాడు. జూబ్లీ హిల్స్‌లోని తన ఫ్లాట్‌లో బంధించి చిత్రహింసలు పెట్టి హతమార్చాడు. మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని అప్పటి నల్లకుంట ఇన్‌స్పెక్టర్‌ వద్దకు, తర్వాత హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో తిప్పి విజయవాడ వైపు తీసుకెళ్లాడు. నందిగామ వద్ద రోడ్డు పక్కన కారు వదిలేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడి పోలీసులు టోల్‌ ప్లాజాల్లో సీసీ కెమెరాల్లో పరిశీలించిగా ఆ కారును రాకేశ్‌ రెడ్డి నడుపుతున్నట్టు తేలింది.

Updated Date - 2023-03-09T16:20:01+05:30 IST