Renukachaudari: ఫైర్‌బ్రాండ్ రేణుకాచౌదరి సంచలన వ్యాఖ్యలు.. ఆమె ఏమన్నారో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-08-25T11:44:51+05:30 IST
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Former Minister Tummala Nageswara Rao) కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరుగుతోందని,
- షర్మిల రాకను టీపీసీసీ వ్యతిరేకించింది
- గుండాల, ఖమ్మం పర్యటనలో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి
గుండాల /ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Former Minister Tummala Nageswara Rao) కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరుగుతోందని, ఆయన కాంగ్రె్‌సలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి(Renukachaudari) పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం భద్రాద్రి జిల్లాలో పర్యటించిన ఆయన రాత్రికి గుండాల మండలం జగ్గాయిగూడెం చేరుకుని పల్లెనిద్ర చేశారు. అనంతరం గురువారం ఉదయం రేణుకాచౌదరి రైతుకూలీలతో కలిసి పాటలు పాడుతూ వరినాటు వేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహానది లాంటిదని, ఎందరో నాయకులను తయారు చేసిందన్నారు. చంద్రబాబు, కేసీఆర్, జగన్ లాంటి వారు కాంగ్రెస్ పునాదులపైనే జెండాలు ఎత్తారన్నారు. రాష్ట్రంలో ‘కారు’ ఎక్కిన వారంతా యూటర్న్‌లు, నోఎగ్జిట్‌లతో సతమతమవుతున్నారన్నారు. వారంతా సొంత గూటికి రాక తప్పదని పేర్కొన్నారు. ఇప్పటికే కొందరు నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, బీఆర్‌ఎస్ నాయకత్వం పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక, బయటకు రాలేక బాధను వెళ్లగక్కుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో రాష్ర్టాన్ని దోచుకొని అప్పులకుప్పగా మార్చి.. ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి బీఆర్‌ఎ్‌సగా పేరు మార్చుకున్నారని ఆరోపించారు. ఏదోస్తే అది మాట్లాడే కేసీఆర్ నోటికి జీఎస్టీ వేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంమూర్తి నాయక్, రామసహాయం మాధవీరెడ్డి, బట్టా విజయ్‌గాంధీ, మంజుల, ఈసం పాపారావు, పొంబోయిన ముత్తయ్య, కల్తి క్రిష్ణారావు, ముత్యమాచారి, వాంకుడోత్ రమేష్, శ్వేత, హరినాథ్, కుంజ కృష్ణ, కల్తి జోగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓటమి భయంతోనే సీఎం రెండుచోట్ల పోటీ
గుండాల నుంచి ఖమ్మం చేరుకున్న రేణుక ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, తన కుమారుడు కేటీఆర్‌కు లైన్‌క్లియర్ చేసేందుకే వ్యాపారులు, ఖూనీకోర్లు, దగాకోర్లకు టికెట్లు ఇచ్చారన్నారు. వైఎ్‌సఆర్‌టీపీ నాయకురాలు షర్మిల కాంగ్రె్‌సలో చేరడాన్ని టీపీసీసీ వ్యతిరేకించిందని, తామంతా షర్మిల అవసరం లేదని చెప్పామని, ఆమె తన తండ్రి ఆశయాలను ముందుకు నడిపించాలంటే ఏపీలోకి వెళ్లి పోరాటం చేయాలని సూచించామన్నారు. అన్నను ఎదిరించి ప్రజల పక్షాన పోరాడాలని సలహా ఇచ్చామన్నారు. మాజీ మంత్రి తుమ్మల మంచి వ్యక్తి అని ఆయన కాంగ్రె్‌సలోకి వస్తే ఎలాంటి సమస్య లేదన్నారు. అయితే కేసీఆర్ తుమ్మలను వదులకుంటాడని తాను అనుకోవటం లేదన్నారు. తనకు సరైన ప్రత్యర్థి ఉంటే ఎక్కడినుంచైనా పోటీ చేస్తానన్నారు.