Share News

Revanth Reddy: నాడు మామ కేంద్ర మంత్రి.. నేడు అల్లుడు ముఖ్యమంత్రి...

ABN , First Publish Date - 2023-12-07T08:45:11+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Revanth Reddy) గురువారం ప్రమాణస్వీకారం చేయనుండడంతో మరోసారి జూబ్లీహిల్స్‌ పేరు తెర మీదకు

Revanth Reddy: నాడు మామ కేంద్ర మంత్రి.. నేడు అల్లుడు ముఖ్యమంత్రి...

- జూబ్లీహిల్స్‌లో ఉండగానే పదవులు

బంజారాహిల్స్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Revanth Reddy) గురువారం ప్రమాణస్వీకారం చేయనుండడంతో మరోసారి జూబ్లీహిల్స్‌ పేరు తెర మీదకు వచ్చింది. రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేసి చాలా కాలమే అయినప్పటికీ ముఖ్యమైన ఘటనలు అన్నీ జూబ్లీహిల్స్‌లో ఉండగానే చోటు చేసుకున్నాయి. అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి(Jaipal Reddy) సోదరుడి కుమార్తెను వివాహం చేసుకున్న రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం 2001 నుంచి 2003 వరకు వర్క్స్‌ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. హౌసింగ్‌ సొసైటీ అభివృద్ధి పనుల్లో కీలకంగా వ్యవహరించడంతోపాటు అక్రమాలపై పలుమార్లు ప్రశ్నించారు. టీడీపీలో చేరిన తరువాత రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో ఆత్మీయులను సంపాదించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు నెంబరు 45లో మరో ఇల్లు నిర్మించుకొని అక్కడకు మారారు. ఇక్కడి నుంచి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగారు. టీడీపీలో కీలక పదవులు చేపట్టారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రె్‌సలో చేరాలనే నిర్ణయం జూబ్లీహిల్స్‌లోనే జరిగింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్త ఇంట్లోకి మారాకే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలకు ఇక్కడే నాంది పడింది.

hyd2.2.jpg

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన సమయాల్లో పోలీసులు గృహ నిర్బంధం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తాను ఆగేది లేదని రేవంత్‌ ప్రతి ఘటనలో దూకుడు స్వభావంతో వ్యవహరించారు. నిరుద్యోగుల సమస్యలు, పేపర్‌ లీకేజీలపై పోరాట సమయంలో పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేయగా ఇంటి వెనుక ప్రహరీ దూకి ఉద్యమ ప్రాంగణానికి చేరుకున్నారు. గతేడాది సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవాలను వ్యతిరేకించిన కాంగ్రెస్‌ గాంధీభవన్‌లో నిరసన దీక్ష నిర్వహించింది. రేవంత్‌ను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాటలు చోటు చేసుకున్నాయి. చివరకు కార్యకర్తల అండతో గాంధీభవన్‌కు వెళ్లారు. జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ విషయంలో రేవంత్‌ రెడ్డి.. పోలీసులు, పాలకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల్లో ఎంఐఎం ప్రజాప్రతినిధులకు చెందిన సంతానం ఉండటంతో కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గ్యాంగ్‌రేప్‌ పై సీఎం కేసీఆర్‌, ఒవైఎసీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2023-12-07T08:45:13+05:30 IST