MLA Rajaiah : సర్పంచ్ నవ్యకు సపోర్ట్‌గా అత్త, ఆడపడుచు.. రాజయ్య వేధింపులపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ఫైర్
ABN , First Publish Date - 2023-06-28T12:14:07+05:30 IST
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ నవ్యకు మద్దతుగా ఆమె అత్త, ఆడపడుచు నిలవడం ఆసక్తికరంగా మారింది.
వరంగల్ : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah), జానకిపురం సర్పంచ్ నవ్య (Sarpanch Navya) ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ నవ్యకు మద్దతుగా ఆమె అత్త, ఆడపడుచు నిలవడం ఆసక్తికరంగా మారింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో నవ్య అత్త, ఆడపడుచు మాట్లాడారు. ఎమ్మెల్యే రాజయ్యతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపారు. తన కోడలు ఏ తప్పు చేయలేదన్నారు. తన కోడలినే ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరులు వేధిస్తున్నారని నవ్య అత్త తెలిపారు. తన కోడలు, కొడుకు గ్రామ అభివృద్ధి కోసం ఒంటిపై బంగారం సహా, పొలం కూడా అమ్మారని నవ్య అత్త తెలిపారు. గ్రామానికి నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యే వేధించారన్నారు.
విధిలేని పరిస్థితుల్లోనే తన కోడలు రోడ్డుపైకి వచ్చిందన్నారు. ఎమ్మెల్యే రాజయ్య వేధింపులపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని నవ్య అత్త ఫైర్ అయ్యారు. తన ఆత్మగౌరవాన్ని చంపుకుని ఓ మహిళా సర్పంచ్ బయటకు వచ్చిందంటే ఎవరూ స్పందించరా? అని నిలదీశారు. నిజానిజాలు తెలుసుకోవాలని.. తమ ఆరోపణల్లో వాస్తవాలు లేకుంటే తమను శిక్షించాలని నవ్య ఆడపడుచు అన్నారు. ఎమ్మెల్యే మనుషులు తమ కుటుంబంలో చిచ్చు పెట్టారన్నారు. కేసీఆర్, కేటీఆర్ తమకు న్యాయం చేయాలని నవ్య ఆడపడచుకోరారు.