MLA Rajaiah: సర్పంచ్ నవ్యకు ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణలు.. వెధవలు ఇప్పటికైనా మారాలన్న నవ్య

ABN , First Publish Date - 2023-03-12T16:04:05+05:30 IST

బీఆర్‌ఎస్ (BRS) పెద్దల ఒత్తిడితో జానకీపురం సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah)మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. ఎందుకంటే..

MLA Rajaiah: సర్పంచ్ నవ్యకు ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణలు.. వెధవలు ఇప్పటికైనా మారాలన్న నవ్య

వరంగల్: బీఆర్‌ఎస్ (BRS) పెద్దల ఒత్తిడితో జానకీపురం సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah)మధ్య సయోధ్య కుదిరింది. తనపై లైంగిక ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్యకు ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణలు చెప్పారు. పార్టీ పెద్దల ఒత్తిడితో ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్‌ ఇంటికి వెళ్లారు. సర్పంచ్ దంపతులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘‘ మానసిక క్షోభకు గురిచేసుంటే క్షమించాలి. తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించాలి. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నా. నేను తప్పుచేశానని భావిస్తే మహిళలందరూ క్షమించాలి. అందరూ కలిసి పనిచేయాలని అధిష్టానం సూచించింది’’ అని మీడియా సాక్షిగా రాజయ్య క్షమాపణలు చెప్పారు.

వెధవలు ఇప్పటికైనా మారాలి: సర్పంచ్ నవ్య

తాను మాట్లాడిన ప్రతి మాట వాస్తవమేనని సర్పంచ్‌ నవ్య మరోసారి చెప్పారు. ‘‘ నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా. చిన్నపిల్లలపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. మహిళలపై అరాచకాలను ప్రశ్నించాలి. మహిళలను ఎవరైన వేధిస్తే భరతం పడతా. సమాజంలో మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఏ స్థాయిలో ఉన్నా మహిళలకు గౌరవం ఇవ్వాలి. తప్పు చేసినట్లు ఒప్పుకుంటే ఎవరినైనా క్షమిస్తా. మళ్లీ అదే తప్పు చేస్తే ఊరుకోను. మహిళలను వేధించే వెధవలు ఇప్పటికైనా మారాలి’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తాటికొండ రాజయ్య తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, గ్రామానికి ఎం చేస్తారో మీడియా ముఖంగా చెప్పాలని నవ్య పట్టుబట్టారు.

కాగా బీఆర్‌ఎస్ పెద్దలు ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని భావించారు. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దల ఒత్తిడితో నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే సర్పంచ్ దంపతులతో ఎమ్మెల్యే రాజయ్య మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.

రాజయ్యపై ఆరోపణలు

తెలంగాణ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్‌ లైంగిక ఆరోపణలు (Allegations) తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసింది. మాట విననందుకు తనపై రాజయ్య లైంగిక వేధింపులకు(Sexual harassment) దిగుతున్నారని నవ్య పేర్కొంది. తనకు ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని.. నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని వేధిస్తున్నాడని నవ్య ఆరోపించారు. మరోవైపు నవ్య తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు.

Updated Date - 2023-03-12T16:25:08+05:30 IST