TSPSC Paper Leak Case: షమీమ్ నివాసంలో కీలక ఆధారాలు సేకరించిన సిట్

ABN , First Publish Date - 2023-03-30T18:04:15+05:30 IST

టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని సిట్ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు.

TSPSC Paper Leak Case: షమీమ్ నివాసంలో కీలక ఆధారాలు సేకరించిన సిట్
TSPSC Paper Leak Case

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో (Paper Leak Case) సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని సిట్ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు కార్యాలయానికి పిలిచి శంకరలక్ష్మి నుంచి వివరాలు సేకరించిన అధికారులు షమీమ్, రమేష్ చెప్పిన వివరాలను నిర్ధారించుకోవడానికి మరోసారి ఆమెను ప్రశ్నిస్తున్నారు. శంకరలక్ష్మి తన డైరీలో రాసుకున్న లాగిన్ పాస్ వర్డ్‌ను ప్రవీణ్, రాజశేఖర్ దొంగిలించి కంప్యూటర్ లోకి లాగిన్ అయ్యారని, కంప్యూటర్‌లో ఉన్న పేపర్‌లను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకున్నారని ఇప్పటిదాకా నిర్ధారించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్‌ను ప్రవీణ్ షమీమ్, రమేష్‌కు ఇవ్వగా, రాజశేఖర్ రెడ్డి సురేష్, ప్రశాంత్ రెడ్డికి ప్రశ్నాపత్రాన్ని ఇచ్చాడని అధికారులు గుర్తించారు. తమకు ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని షమీమ్, రమేష్ అడిగినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే తమకు ప్రశ్నాపత్రం ఇవ్వాలని షమీమ్ అడిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు శంకరలక్ష్మి నుంచి అధికారులు మరి కొన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. టీఎస్‌పీఎస్సీలో షమీమ్, రమేష్‌లు చేసే పని, ఇతర వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

మరోవైపు ఎల్ బీ నగర్ లోని షమీమ్ నివాసంలో సిట్ సోదాలు ముగిశాయి. షమీమ్ ఇంట్లో సిట్ అధికారులు గంట పాటు సోదాలు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ తరువాత ఇంటి నుంచి ఎవరెవరితో మాట్లాడిందనే వివరాలు సేకరించారు. సురేష్, రమేష్.. షమీమ్ ఇంటికి ఎప్పుడెప్పుడు వచ్చారనే వివరాలు సేకరించారు. షమీమ్ నివాసంలో ప్రశ్నాపత్రాలకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు.

టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో ఉద్దేశపూర్వకంగానే టెక్నికల్ సర్వీస్‌ నుంచి టీఎస్‌పీఎస్సీకి డిప్యుటేషన్‌పై వచ్చిన రాజశేఖర్ రెడ్డి(Atla Rajashekar Reddy), సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌(Pulidindi Praveen Kumar), మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు రేణుక(Renuka)ను నిందితులుగా సిట్ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు.

మరోవైపు టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ కేసులో అనేక అక్రమాలు జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar), టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపిస్తున్నారు. దీనిపై ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) పరువు నష్టం దావా 100 కోట్ల రూపాయలకు వేస్తానని హెచ్చరించారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ కేసుపై రగడ నెలకొంది.

Updated Date - 2023-03-30T18:20:09+05:30 IST