MLA Rajaiah: క్షమించండి.. తప్పు తెలుసుకున్న ఎమ్మెల్యే రాజయ్య
ABN , First Publish Date - 2023-03-12T16:44:10+05:30 IST
ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) ఎట్టకేలకు దిగివచ్చారు. రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య..
వరంగల్: ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) ఎట్టకేలకు దిగివచ్చారు. రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య (Janakipuram Sarpanch Navya) సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల (Allegations) నేపథ్యంలో రాజయ్య ఈ రోజు నవ్య నివాసానికి వెళ్లారు. నవ్య ఇంటి దగ్గర మీడియాతో రాజయ్య మాట్లాడుతూ మానసిక క్షోభకు గురిచేసుంటే క్షమించాలని కోరారు. తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించాలన్నారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని ప్రశ్చాత్పాపం ప్రకటించారు. తాను తప్పుచేశానని భావిస్తే మహిళలందరూ క్షమించాలని విజ్ఞప్తి చేశారు. తాను చేసిన శిఖండి వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడతానని రాజయ్య వివరణ ఇచ్చారు.
నేను మాట్లాడిన ప్రతి మాట వాస్తవమే
తాను మాట్లాడిన ప్రతి మాట వాస్తవమేనని సర్పంచ్ నవ్య వెల్లడించారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చిన్నపిల్లలపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, మహిళలపై అరాచకాలను ప్రశ్నించాలని కోరారు. మహిళలను ఎవరైన వేధిస్తే భరతం పడతానని హెచ్చరించారు. సమాజంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ స్థాయిలో ఉన్నా మహిళలకు గౌరవం ఇవ్వాలన్నారు. తప్పు చేసినట్లు ఒప్పుకుంటే ఎవరినైనా క్షమిస్తానని, మళ్లీ అదే తప్పు చేస్తే ఊరుకోనని ఘాటుగా హెచ్చరించారు. మహిళలను వేధించే వెధవలు ఇప్పటికైనా మారాలని నవ్య హితవుపలికారు.
సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య సయోధ్య
సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య బీఆర్‌ఎస్ పెద్దలు సయోధ్య (Reconciliation) కుదిర్చారు. ఆదివారం రాజయ్య నేరుగా నవ్య ఇంటికి వెళ్లారు. ముందు అనుకున్నట్లే రాజయ్య మహిళలకు క్షమాపణ చెప్పారు. ఇటీవల రాజయ్య తనను లైంగికంగా వేధించారని నవ్య ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ పెద్దలు ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని భావించారు. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దల ఒత్తిడితో నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య వెళ్లినట్లు చెబుతున్నారు.