Talasani: త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి.. అర్హులందరికీ డబుల్ బెడ్‌రూంలు
ABN , First Publish Date - 2023-11-25T11:02:38+05:30 IST
శ్యామలకుంటవాసులకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని సనత్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- శ్యామలకుంటవాసులకు త్వరలో మంచి రోజులు
సనత్‌నగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): శ్యామలకుంటవాసులకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని సనత్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు. గురువారం రాత్రి సనత్‌నగర్ డివిజన్‌లోని శ్యామలకుంట, ఆదిత్యనగర్, ఉదయ్‌నగర్, రవీందర్‌నగర్, బాలయ్యనగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు మంత్రికి నుదుటన తిలకం దిద్ది మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. శ్యామలకుంటలో స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఇళ్లు నిర్మించుకొని పేదలు నివసిస్తున్నారని చెప్పారు. ఈ స్థలం కొంత వివాదంలో ఉన్న కారణంగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయామని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గృహలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం రూ. 3 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. శ్యామలకుంటవాసులకు అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. దేశంలోనే అత్యధిక సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. నగరంలో సొంత ఇల్లు లేని 70 వేల మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లను ఉచితంగా ఇచ్చామని, మరో 30 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అందని వారు బాధపడొద్దని, మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని, అర్హులందరికీ అందిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.400కు గ్యాస్ సిలిండర్, రేషన్‌పై సన్నబియ్యం, కేసీఆర్ ఆరోగ్య భద్రత కింద రూ.15 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని వివరించారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు తలసానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. మంత్రి వెంట కార్పొరేటర్ కొలను లక్ష్మి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్, నాయకులు సురే్‌షగౌడ్, ఖలీల్, బాల్‌రాజ్, రమేష్ గౌడ్, ఆయా కాలనీల అధ్యక్షులు సుధీర్, విజయ్‌సింగ్ పాల్గొన్నారు.
ముస్లిం పెద్దల సన్మానం
సనత్‌నగర్ జామా మసీదు జాఫ్రీ ప్రాంతంలో శుక్రవారం సనత్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ముస్లిం లను కలిశారు. మసీదు పెద్దలు, మౌలానాలు, ముస్లింలు మంత్రిని సన్మానించారు. మంత్రి వెంట కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, కొలను బాల్‌రెడ్డి, ఖలీల్, నోమాన్, జమీర్, కరీంలాలా, సురే్‌షగౌడ్, భూపాల్‌రెడ్డి, బాల్‌రాజ్, కరుణాకర్‌రెడ్డి, ఇబ్రహీం ఉన్నారు.